PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

1 min read

నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేయ‌డ‌మే ల‌క్ష్యం

క్రెడాయ్ సౌత్‌కాన్-2024 స‌ద‌స్సులో మంత్రి పొంగూరు నారాయణ

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క మ‌రియు ప‌ట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శ‌నివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోట‌ల్‌లో నిర్వహించిన సౌత్‌కాన్ 2024 కార్యక్రమంలో మంత్రి నారాయ‌ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. అదేవిధంగా లే అవుట్‌లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామ‌న్నారు. నిబంధనలు ఉల్లంఘించ‌కుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు, బోడే ప్రసాద్‌, బోండా ఉమామ‌హేశ్వర‌రావు, క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బోమన్ ఇరానీ మాట్లాడుతూ, దక్షిణ భారత రాష్ట్రాలు వాణిజ్య, నివాస మరియు రిటైల్ రియల్ ఎస్టేట్ కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రాలుగా ఉన్నాయ‌న్నారు. క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి.రామ్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రాంతీయ మార్కెట్ల స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ భారత రియల్ ఎస్టేట్ రంగానికి కీలక ఘట్టాన్ని సౌత్‌కాన్ ఆవిష్కరిస్తుంద‌న్నారు. క్రెడాయ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ బి.రాజా శ్రీనివాస్, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధరన్ స్వామినాథన్ మాట్లాడుతూ, “క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న సౌత్‌కాన్ 2024, వివిధ రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల ప్రముఖులను ఏకం చేసేలా సౌత్‌కాన్ నిర్వహించ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వై.వి.రమణరావు, సౌత్‌కాన్ కన్వీనర్ డి.రాంబాబు మాట్లాడుతూ, భాగస్వామ్యాలు పెంపొందించుకోవ‌డం, ఆవిష్కరణ, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డెవలపర్‌లను ఒకచోట చేర్చింద‌ని పేర్కొన్నారు.

About Author