ఉత్తమ మరుగుదొడ్లకు పురస్కారాలు అందజేసిన జిల్లా కలెక్టర్
1 min readనవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు జిల్లా అంతటా ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం అవగాహనా సదస్సులు”
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం క్యాంపెయిన్ లో భాగంగా ఉత్తమ మరుగుదొడ్లు నిర్వహించిన వారికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పురస్కారాలు అందజేశారు.మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో “హమారా శౌచాలయ్-హమారా సమ్మాన్” కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు పరిశుభ్రంగా నిర్వహించిన వారికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు జిల్లా అంతటా “హమారా సౌచాలయ-హమారా సమ్మాన్” పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి, ఉత్తమ వ్యక్తిగత, కమ్యూనిటీ మరుగుదొడ్లు గల వారిని జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన 10 మందికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా వినియోగంలో లేని టాయిలెట్లను గుర్తించి వినియోగంలోకి తెచ్చేలా అవగాహన కలిగించడం, నిర్వహణ పై చైతన్యం తీసుకొని రావడం, పాఠశాలలలో, అంగన్వాడీ కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో టాయిలెట్ల మరమ్మత్తులు ఉన్నవాటిని గుర్తించి మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా వాటర్ ట్యాంక్ లలో నీటిని తనిఖీలు జరిపి, పారిశుధ్యం పై బహిరంగ మల విసర్జన పై అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా పారిశుధ్య కార్మికులకు పనిముట్లను అందజేయడం, సన్మానించడం వంటి కార్యక్రమాలతో పాటు వారికీ ప్రభుత్వ పథకాలు అందేలా నమోదు చేయడం, ప్రజల్లో మరుగుదొడ్లని వాడేలా ప్రవర్తనా మార్పులను తీసుకువచ్చేలాగున, ఓ.డి.ఎఫ్ కోసం కృషి చేయడం జరిగిందన్నారు.అనంతరం గూడూరు మండలం జూలేకల్ గ్రామానికి చెందిన జె.వెంకటమ్మ, కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన రెడ్డిపోగు సోమన్న, వెల్దుర్తి మండలం బోగోలు గ్రామానికి చెందిన ఈ.లక్ష్మీదేవి, వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన షేక్ పర్వీన్, కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన కె.భక్షు బీ, గోనెగండ్ల మండలం గంజేహల్లి గ్రామానికి చెందిన సి.మహేశ్వరి, తుగ్గలి మండలం తుగ్గలి గ్రామానికి చెందిన హరిజన రత్నమయ్య, కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన ఎం. రత్నాకర్, గోనెగండ్ల మండలం కర్నూర్ గ్రామానికి చెందిన బి.కృష్ణవేణి (సర్పంచ్)లకు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు.కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, డిపిఓ గుర్రాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.