PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ భవిష్యత్తుకు నారీశక్తి అవసరం…

1 min read

బాలికల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికితీయండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: దేశ భవిష్యత్తు కోసం నారీ శక్తి అవసరత ఎంతైనా ఉందని… ఆ దిశలో పయనించేందుకు మొక్కవోని దీక్షతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విద్యార్థినులకు ఉద్బోధించారు.మంగళవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొంటూ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి లీలావతి, వరల్డ్ విజన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి తిరుపతిరావు, గర్ల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ సువర్చల, డిప్యూటీ డిఎంహెచ్వో శారదాబాయి, అడ్వకేట్ హిమబిందు, మదర్ సొసైటీ ఫౌండర్ రామారావు, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థినిలలో సృజనాత్మకత ఆలోచనలు రేకెత్తించి ఏదైనా సాధించగలమన్న స్ఫూర్తిని తీసుకొచ్చారు. ప్రతిఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటామని ఈ ఏడాది “దేశ భవిష్యత్తు కోసం బాలికల దృష్టి” అనే థీమ్ తో బాలికలు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్లి సాధించే తపన ఉండాలన్నారు. అకడమిక్ విద్యతో పాటు బాలికల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీసి ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, గురువులదేనని ఆమె తెలిపారు. విద్యార్థులు ఉత్తీర్ణతతో పాటు, పోటీ పరీక్షలకు కూడ సిద్ధమై తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విశేష కృషి చేయాలన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థి దశ నుండే ఉత్సాహంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి విషయాన్ని విశ్లేషించి తెలియని విషయాలను మొహమాట పడకుండా ప్రశ్నించి తెలుసుకుంటే జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థి దశలో అనేక ఆకర్షణీయమైన వస్తువులపై మమకారం ఉంటుందని…. స్వశక్తితో ఆ వస్తువులను సంపాదించుకొనే కష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలన్నారు.విద్యనభ్యసించే చదువుతో పాటు పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకొంటే సంబంధిత విషయాలపై సంపూర్ణ పరిజ్ఞానం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. గత ఐదారు సంవత్సరాల నుండి గమనిస్తే అబ్బాయిలు వద్దు అమ్మాయిలే జన్మించాలన్న ఆలోచనలతో తల్లిదండ్రులు ఉన్నారని…. భవిష్యత్తులో అమ్మాయిలే కావాలన్న దృక్పధానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా సమాన దృష్టితో చూసే ధోరణి తల్లిదండ్రులు కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. అనుకోని పరిస్థితులలో అవాంఛనీయ సంఘటనలు ఎదురైనప్పుడు  అమ్మాయిలకు సున్నితమైన నైపుణ్యాలతో పాటు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండే దిశలో శిక్షణ పొందాలన్నారు.మొబైల్ వినియోగంతో పాటు పుస్తక పఠనానికి కూడా అధిక ప్రాధాన్యత నిచి మానవతా, నీతి నైపుణ్యాల విలువలతో కూడిన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. మంచి స్థాయిలో నిలబడాలన్న కలను సార్థకం చేసుకునేందుకు నిత్యం ప్రయత్నించాలన్నారు. దేశ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి బలంగా ఉండాలంటే స్త్రీ శక్తి సేవలు అవసరమన్నారు. కుటుంబ అభివృద్ధితోపాటు  సమాజ, జిల్లా, రాష్ట్ర,దేశ అభివృద్ధికి కూడా మహిళలు రాణించి పదిమందికి స్ఫూర్తిదాయకంగా వుంటూ తోటి వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతి విద్యార్థిని నాయకత్వ లక్ష్యాలను అలవర్చుకొని తల్లిదండ్రులు, గురువులతో పాటు దేశం గర్వపడే స్థాయికి వెళ్లాలని ఆమె హితవు పలికారు. అంతకుముందు వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రదర్శించిన విద్యార్థులకు కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. మహిళా సాధికారతపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన స్టాళ్లు ఆకర్షించే రీతిలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *