రైతు శాస్త్రవేత్తల పనితీరు భేష్
1 min readమెక్సికో బృందం ప్రశంశ
సాధారణ కుటుంబం నుంచి యువతీ యువకులు ఎంపిక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రైతు సాధికార సంస్థ రూపొందించిన రైతు శాస్త్రవేత్తల కోర్సు, శాస్త్రవేత్తల పనితీరు అద్భుతం అని మెక్సికో ప్రతినిధి బృందం ప్రశంసించింది. సాధారణ రైతు కుటుంబాల నుంచి యువతీ యువకులను ఎంపిక చేసి శాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దడం వినూత్న విధానం అని కితాబునిచ్చింది. తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియానేటివిటీ నేతృత్వంలో మెక్సికో ప్రతినిధి బృందం శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలలో పాలుపంచుకొంది. మెక్సికో బృంద సభ్యులు పెదవేగి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో రైతు శాస్త్రవేత్తలు మరియు మెంటార్ లతో ముచ్చటించారు. కోర్సు విధి విధానాలను, కోర్సులో నేర్చుకొన్న మెలకువలను, విజ్ఞానాన్ని వ్యవసాయ సాగుకు అనుసంధానించే విధానం, శాస్త్రవేత్తల రోజువారీ విధులు తదితర అంశాలను అడిగి తెలుసుకొన్నారు. మెక్సికో బృందం శుక్రవారం ముందుగా ఏలూరు మండలంలోని వెంకటాపురం గ్రామం ను సందర్శించి అక్కడ 10 మంది కౌలు రైతులు సమిష్టిగా 16 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న వరి పంటను పరిశీలించారు. రైతు సాధికార సంస్థ సూచనల మేరకు కాంపాక్ట్ బ్లాక్ పేరుతో సరికొత్తగా నిర్వహిస్తున్న ఈ నమూనాలో గట్లను వెడల్పు చేయడం ద్వారా కూరగాయలు పండించి రైతులు అదనపు ఆదాయం పొందడం బృంద సభ్యులను ఆకర్శించింది. గట్లపై వేసిన కూరగాయల విక్రయం ద్వారా ఎకరాకు 30 వేల రూపాయలను అదనంగా పొందుతున్నట్లు రైతులు తెలిపారు. వరి గట్ల పై పండించిన రసాయన రహిత కూరగాయలను జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో విక్రయస్తున్నామని, వరి పంట ఉత్పత్తులను శ్రీవారి నైవేద్యం మరియు నిత్యాన్నదానం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వరిలో నవారా, మైసూర్ మల్లిగ, బ్లాక్ రైస్,రక్తశాలి తదితర రకాలు పండిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తన దశ నుంచి విత్తనం వరకు ఎలాంటి రసాయనాల జోలికి వెళ్ళకుండా పూర్తిగా జీవ ఎరువులను మాత్రమే వినియోగిస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఎకరాకు 40 బస్తాల దిగుబడి సాధ్యం అవుతోందని, రసాయన వ్యవసాయంతో పోల్చితే ఎకరాకు నాలుగైదు బస్తాలు అధికంగా దిగుబడి అవుతుందని చెప్పారు. అనంతరం పెదవేగి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో 29 మంది రైతులు కలిసి సమిష్టిగా 32 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న వరి పంటను పరిశీలించారు. అక్కడ రైతులతో ముచ్చటించి ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అదే గ్రామంలో మెంటార్ గా పనిచేస్తున్న రైతు కటారు రంగయ్య వ్యవసాయ క్షేత్రం సందర్శించారు. ఆ క్షేత్రంలో రంగయ్య అమలుచేస్తున్న అయిదు అంతస్తుల నమూనాను క్షుణ్ణంగా పరిశీలించారు. డెయిరీ, కోళ్ళ పెంపకంతో పాటు తన రెండున్నర ఎకరాలలో పండిస్తున్న అనేక రకాల పంటల ద్వారా కేవలం 55 వేల రూపాయల పెట్టుబడితో ఏడాది కాలంలో 5 లక్షలకు పైగా నికర ఆదాయం పొందినట్లు రంగయ్యబృంద సభ్యులకు వివరించారు. తన పొలంలో కొబ్బరి, పసుపు, వక్క, నిమ్మ, అరటి,మామిడి, సపోటాతో పాటు అనేక రకాల ఆకుకూరలు, కాయగూరలను పండిస్తున్నట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ అధికారులు అరుణ, సురేష్, మధు ప్రీతి, సరోజ, ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ తాతా రావు, అదనపు మేనేజర్ వెంకటేష్ తదితరులు బృందం వెంట పాల్గొన్నారు.