PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు అభినందనీయం

1 min read

అందుకే వారిని ప్రత్యక్ష దైవాలుగా అభివర్ణిస్తారు.

ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు అభినందనీయమని, అందుకే వైద్యులను ప్రత్యక్ష దైవాలుగా అభివర్ణిస్తారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూల్ నగరంలోని బి క్యాంప్ లో ఉన్న ఐఎంఏ భవన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పితామహుడు డాక్టర్ బి సి రాయ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ బాల మద్దయ్య ,డాక్టర్ శివశంకర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రామచంద్ర నాయుడు ,డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కరోనా సమయంలో కుటుంబ సభ్యులే ఒకరితో ఒకరు కలవలేని పరిస్థితుల్లో, వైద్యులు కరోనా ఉందని తెలిసిన పేషెంట్లకు అందించిన సేవలు అభినందనీయమని చెప్పారు. కర్నూల్ నగరంలో ఐఎంఏ భవనాన్ని నిర్మించడం, అందులో తమ టీజీవి గ్రూపు భాగస్వామ్యం ఉండడం ఆనందంగా ఉందని తెలియజేశారు .తాను ఎమ్మెల్యే కావడంలో అందరితోపాటు వైద్యుల ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆయన వివరించారు .అందరి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు .నగరంలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను తాను ఆకస్మికంగా తనిఖీ చేశానని, తన పర్యటనలో ప్రభుత్వ వైద్యశాలలో ఎన్నో సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలియజేశారు. వాటి అన్నింటిని ప్రణాళిక బద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. కర్నూలు నగరంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతామని వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కుంటుబడిపోయిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం, ఐటి రంగం రాష్ట్రానికి ముఖచిత్రం వంటివని, ఈ రెండు రంగాల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు .గతంలో చెప్పిన మేరకు కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక వైద్య చికిత్సలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే  గౌరు చరిత వెంకట రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వైద్యుల పాత్ర మరువలేనిదని తెలియజేశారు. ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ఆమె అభినందించారు. వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూల్ నగరంలో ఐఎంఏ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ముఖ్యంగా కర్నూల్ నగరంలో  ఐఎంఏ భవన నిర్మాణానికి వారు అందించిన సహకారం మరువలేని తెలిపారు. అనంతరం డాక్టర్స్ డేను పురస్కరించుకొని సీనియర్ వైద్యులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తో పాటు ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డిని సన్మానించారు.

About Author