పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకున్నపుడే మానవాళికి మనుగడ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకున్నపుడే మానవాళికి మనుగడ ఉంటుందని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ అభిప్రాయపడ్డారు. మూడవ శనివారం సందర్భంగా వర్సిటీ NSS విభాగంవారు క్యాంపస్లోని మహిళల హాస్టళ్లవద్ద నిర్వహించిన పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్సిటీ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడటంలో ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. హాస్టళ్ల పరిసరాలను ఆహ్లాదకరంగా మలచుకోవడంలో విద్యార్థులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. హాస్టళ్లచుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రంచేసిన వాలంటీర్లను వి.సి. అభినందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంవల్ల దోమల బెడదను, తద్వారా వ్యాధులవ్యాప్తిని నివారించవచ్చునని వర్సిటీ NSS కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డితోపాటు విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక అధ్యాపకులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు, వివిధ విభాగాలు పాల్గొన్నాయి.