దేశాభివృద్ధి కోసం పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందాలి
1 min readమాతృ దినోత్సవ సందర్భంగా బాలికా క్రీడాకారులను సన్మానించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజీస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మహిళా సాధికారత కోసం దేశాభివృద్ధి కోసం పార్లమెంటులో మహిళా బిల్లుకు ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలిక క్రీడాకారులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో మహిళలకు గౌరవం లభిస్తుందని చెప్పారు. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆయన వివరించారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా సాధికారికత కోసం పార్లమెంటులో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు త్వరలోనే ఆమోదం లభించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో మహిళ బాగుంటే ఆ కుటుంబంతో పాటు దేశం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తుందని వివరించారు. ప్రస్తుతం మహిళలపై దాడులు అధికం అవుతున్నాయని వాటి నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రస్తుతం మాతా శిశు మరణాల రేట్లు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. దేశంలో గర్భిణీ స్త్రీలు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని గర్భిణీ స్త్రీలకు మంచి పోషక విలువలను ఆహారాన్ని అందించడంతోపాటు వారికి మెరుగైన వైద్య సేవలు అందించవలసిన ఆవశ్యకత ఉందన్నారు .ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించడం కనీస బాధ్యతగా గుర్తించాలని ఆయన కోరారు .ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే మన దేశం మహిళల విషయంలో గొప్ప స్థానంలో ఉందని, ఈ దేశంలో మహిళా ప్రధాన మంత్రి, మహిళా ముఖ్యమంత్రులు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలు అందించిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలు ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తై క్వాండో శిక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.