ఏకకాలంలో మూడు శస్త్రచికిత్సలు!
1 min read* సంక్లిష్ట స్థితిలో ఉన్న రోగికి ప్రాణదానం
* హైదరాబాద్ పెద్దాసుపత్రుల్లోనూ నయం కాని సమస్య
* కర్నూలు కిమ్స్ వైద్యుడు డాక్టర్ జానకిరామ్ ఘనత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న ఒక రోగికి ఏకకాలంలో మూడు రకాల శస్త్రచికిత్సలు చేసి అతడి ప్రాణాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా నయంకాని అతడి సమస్య.. కర్నూలు లాంటి చిన్న కేంద్రంలోని ఒక ఆస్పత్రిలో నయమైందని కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, జీఐ ఆంకాలజిస్టు, అడ్వాన్స్‌డ్ లాప్రోస్కొపిక్, హెచ్‌పీబీ సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎస్.జె. జానకిరామ్ తెలిపారు. “తాడిపత్రి ప్రాంతానికి చెందిన రైతు 50 ఏళ్ల చంద్రమోహన్ గతంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వేర్వేరు ఆస్పత్రులలో చూపించుకున్నారు. ఆయనకు చిన్నపేగులకు రక్తం సరఫరా అయ్యే ప్రధాన రక్తనాళంలో అడ్డంకి (క్లాట్) ఏర్పడడం, దాంతోపాటు పెద్దపేగు, చిన్నపేగు కలిసేచోట కొంత పాడైపోవడం, ఇతర సమస్యలు ఉన్నాయి. స్థానికంగా వేరే ఆస్పత్రులలో కొంత చికిత్స చేసినా, మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడ పెద్ద పెద్ద ఆస్పత్రులలో చూపించినప్పుడు పేగులు ఒకచోట బాగా సన్నబడిపోవడంతో మలవిసర్జనకు ఇబ్బంది ఏర్పడిందని.. 15 రోజుల పాటు టీపీఎన్ (టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్) నరాల ద్వారా ఇచ్చారు. తాత్కాలికంగా సమస్య కొంత తగ్గింది. మూడు నెలల తర్వాత మళ్లీ ఇబ్బంది ఎక్కువ కావడం, కడుపునొప్పి రావడంతో ఏమీ తినలేకపోవడం లాంటి సమస్యలతో ఈసారి కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. అతడికి సీటీ స్కాన్, కొలనోస్కొపీ లాంటి పరీక్షలు చేసి, అసలు సమస్యను గుర్తించాం. గాల్‌బ్లాడర్‌లో రాయి ఇబ్బంది పెడుతుండడం, దాంతోపాటు పేగు ఒకచోట బాగా పాడైపోయి సన్నబడిపోవడం, అప్పటికే ఒకచోట బయటపెట్టి ఉంచడం లాంటి సమస్యలు ఉన్నాయి. అతడికి ఆల్బుమిన్ స్థాయి కేవలం 1.9 మాత్రమే ఉంది. ఆరోగ్యవంతులకు ఇది 3.5 నుంచి 5 వరకు ఉండాలి. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. ముందుగా అతడిని ఎంత తినగలిగితే అంత, ఎన్నిసార్లు తినగలిగితే అన్నిసార్లు ఆహారం తీసుకోవాలని చెప్పాం. దానివల్ల అతడి ఆల్బుమిన్ స్థాయి 2.8 వరకు వచ్చింది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అయితే, శస్త్రచికిత్స బాగా సంక్లిష్టమని, రోగి ప్రాణాలకు కూడా గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి, కుటుంబసభ్యులు అంగీకరించిన తర్వాత శస్త్రచికిత్స చేశాం. గాల్ బ్లాడర్ తొలగింపు, బయట పెట్టిన భాగాన్ని మళ్లీ లోపల పెట్టి అతికించడంతో పాటు, పాడైన కొంత భాగం పేగును పూర్తిగా తొలగించి పైన, కింద ఉన్న రెండు భాగాలను కలిపి కుట్టాం. దానివల్ల అతడి సమస్యలన్నీ పూర్తిగా నయమయ్యాయి. చంద్రమోహన్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉండి, ఆహారం కూడా సాధారణంగా తీసుకోగలుగుతున్నారు” అని డాక్టర్ జానకిరామ్ వివరించారు.
ప్రాణాలు కాపాడారు.. ధన్యవాదాలు
“నా భర్తకు ఆరోగ్యం బాగోలేదని కర్నూలు, హైదరాబాద్ నగరాల్లో పెద్ద ఆస్పత్రుల చుట్టూ కూడా తిరిగాం. అక్కడ మాకు బాగా ఖర్చయినా సమస్య మాత్రం తీరలేదు. దాంతో చివరకు మళ్లీ కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ జానకిరామ్ డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పినా ఆపరేషన్ చేయాలని కోరాం. ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత మా భర్త పూర్తిగా కోలుకున్నారు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది, నర్సులు అందరూ మమ్మల్ని బాగా చూసుకున్నారు. కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు” అని చంద్రమోహన్ భార్య తెలిపారు.