కోడిపందేలు నిర్వహించాలంటే భయపడేలా చర్యలు ఉండాలి
1 min readకోడిపందేలు, జూదం, గుండాటలపై ఉక్కుపాదం
నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు
కోడిపందేలకోసం సిద్ధం చేసిన మైదానాలను ట్రాక్టర్లు, జేసిబిలు ద్వారా తొలగించాలి
డివిజనల్, మండలస్ధాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా ఎస్పీ కె.పి.ఎస్ కిషోర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జిల్లాలో ఎక్కడైనా కోడిపందేలు నిర్వహించాలంటే భయపడేలా అధికారుల చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.శుక్రవారం జిల్లా, మండలస్ధాయి అధికారులు, పోలీసు,ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో స్ధానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కె.పి.ఎస్ కిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కోడిపందేలు, జూదం, గుండాట, మద్యం అక్రమ రవాణాపై నిరంతర గట్టి నిఘా ఉంచాలన్నారు.కోడిపందేలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలోని డిఎస్పీలు, ఎస్ హెచ్ఓలతో సమన్వయంతో పర్యవేక్షించడానికి సబ్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు వారి సంబంధిత కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోడిపందేలు, జూద క్రీడల వంటి వాటిజోలికి ముఖ్యంగా యువత వెళ్లకుండా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సాంప్రదాయ క్రీడలు , కబాడీ, వాలీబాల్, క్రికెట్ తదితర పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. రంగోలి తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించేలా చూడాలన్నారు.కోడిపందేల నిర్వహకులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అదే విధంగా ఎ.పి. గాంబ్లింగ్ యాక్ట్ 1974 సెక్షన్-3(1), సెక్షన్-9(2) కోడిపందేలు నిర్వహించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గౌ. హైకోర్టు ఆదేశాలు మేరకు జిల్లాలో ఇప్పటికే మండలస్ధాయిలో ఏర్పాటుచేసిన సంయుక్త తనిఖీ బృందాలు సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. అన్ని గ్రామాలు పర్యటించి కోడిపందేలు నిర్వహణకు ప్రతిపాధించిన స్ధలాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్-163 బిఎన్ఎస్ఎస్ కింద కోడిపందేలు కోసం సిద్ధం చేసిన మైదానాలను ట్రాక్టర్లు, జేసిబిలు ద్వారా తొలగించాలన్నారు. కోడిపందేలు, జూదం, బెట్టింగ్, నిర్వహణ కోసం సేకరించిన ఏదైనా డబ్బును సంబంధిత వ్యక్తులనుండి సంయుక్త తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకొనే అధికారం ఉందన్నారు. గ్రామస్ధాయిలో కూడా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఏవైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తిస్తే కోడిపందేలు, జూదం, నిర్వహించే వ్యక్తులపై తక్షణమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని మొబైల్ పోలీసు బృందానికి సూచించారు. కోడిపుంజుల కాళ్లకు కత్తులు, బ్లేడులు కట్టి ప్రదర్శించడం, గాలిలోకి విసిరివేయడం నిషేదమన్నారు. కోడిపందేలు, బెట్టింగ్ లను సమర్ధవంతంగా నిరోధించేందుకు గ్రామస్ధాయిలో తహశీల్దార్లు, ఎస్ హెచ్ఓలు సమావేశం నిర్వహించి 1960, 1974 చట్టాలయొక్క నిబంధనలను తెలియజేయాలన్నారు. అదే విధంగా ఈ విషయాలపై టాం టాం, పత్రికా ప్రకటన, ప్లెక్సీలు ముద్రించే షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు చేసి ప్లేక్సీలను ముద్రించడం ద్వారా కోడిపందేలు, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రచారం చేసే షాపులపై దాడులు చేయాలన్నారు. గౌ. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఏర్పాటు చేసిన సంయుక్త తనిఖీ బృందాలు గట్టిగా పనిచేసి ఎటువంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు , ఏస్ బి సిఐ మల్లేశ్వర రావు తదితరులు పాల్గొనగా ఆయా రెవిన్యూ డివిజన్ల నుంచి నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డిఓలు అచ్యుత అంబరీష్, ఎం.వి. రమణ, పలువురు డిఎస్పీలు, తహశీల్దార్లు, ఎస్ హెచ్ఓలు తదితరులు హాజరయ్యారు.