నిర్ణయించిన ధరకే.. ఇసుక రవాణా…
1 min readట్రాక్టర్, లారీ యజమానులకు సూచించిన కలెక్టర్ రంజిత్ బాష
- అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడి
కర్నూలు, పల్లెవెలుగు: ట్రాక్టర్/లారీ యజమానులు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని, అంతకుమించిన ధరను వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి అధికారులతో బోట్ మెన్ సొసైటీలు, ట్రాక్టర్, లారీ యాజమాన్యాలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సి.బెలగల్ మండలంలోని కొత్తకోట, కె.సింగవరం, పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె గ్రామాలలోని ఐదు డిసిల్టేషన్ పాయింట్లలో ప్రజలకు ఇసుక అందుబాటులోకి రానుందన్నారు.. ఇసుక ధర తవ్వకంతో పాటు జిఎస్టీ, లోడింగ్, సీనరేజ్ తదితర చార్జీలు కలిపి ఒక టన్ ధరకు వినియోగదారుడు మొత్తం రూ.326/- చెల్లించేలా కమిటీ నిర్ణయించిందన్నారు..
టన్ను ఇసుక రవాణ ధర ఇలా…
ఇసుక రవాణా కు సంబంధించి, డీసిల్టింగ్ పాయింట్ నుండి 20కి.మీ లోపు ఉంటే ట్రాక్టర్ (4.5 టన్స్) రూ.1400/-, 6 టైర్స్ లారీ (10 టన్స్) రూ.2000/-, 10 టైర్స్ లారీ (18 టన్స్) రూ.3600/-, 12 టైర్స్ లారీ (22 టన్స్) రూ.3840/-, 16 టైర్స్ లారీ (31 టన్స్) రూ.4480/- గా నిర్ణయించడం జరిగిందని, 20కి.మీ దాటితే ఒక కిలో మీటర్ కు, ఒక టన్ కు రూ.8/-, అదే 16 టైర్స్ లారీకి మాత్రం ఒక కిలో మీటర్ కు, ఒక టన్ కు రూ.7/-ల చొప్పున అదనంగా వినియోగదారుడు నుండి తీసుకోవచ్చని, అంతకంటే ఎక్కువగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తే వాహనాలను బ్లాక్ లిస్ట్ లోకి తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్/లారీ యజమానుల వివరాలన్నింటినీ ప్రదర్శించడం జరుగుతుందని, ఆ వాహనాలను మాత్రమే అక్కడికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ వివరాలను బుకింగ్ పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్నారు. రోజుకు సుమారుగా 250 మంది వినియోగదారులకు ఇసుక సరఫరా చేసే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
రీచ్ల వద్ద.. నిఘా..
ఇసుక డిసిల్టేషన్, స్టాక్ పాయింట్స్, రీచ్ ల వద్ద తహశీల్దార్, ఆర్డీఓ ఇసుక తవ్వకం, రవాణా పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. అక్రమంగా ఇసుక సరఫరా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా సంబంధిత 5 శాఖల సిబ్బంది ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద ఉండడంతో పాటు పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రీచ్ లో సిసి కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ఆదేశించారు. అంతేకాకుండా ఇసుక పాయింట్స్ వద్ద మ్యాప్స్, ధరల పట్టిక, ఇసుక అమ్మకం.వివరాలతో పోస్టర్ లు ఏర్పాటు చేయాలన్నారు.. వాహనాల ధర పట్టికను కూడా ప్రతి స్టాక్/బుకింగ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు సి.బెలగల్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న గ్రామ సచివాలయంలో, మైనింగ్ కార్యాలయంలో బుకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని, బుకింగ్ రశీదులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఐదు డిసిల్టేషన్ పాయింట్లకు సి.బెలగల్ తహశీల్దార్ ను ఇంఛార్జిగా నియమించామన్నారు. అదే విధంగా కౌతాళం మండలంలోని గుడికంబాలి, నదిచాగి, మరలి లను ఓపెన్ ఇసుక రీచ్ లుగా ప్రతిపాదించడం జరిగిందని, వాటికి ఈ నెల 31వ తేదిన పబ్లిక్ హియరింగ్ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, ఆదోని ఇంఛార్జి సబ్ కలెక్టర్ విశ్వనాథ్, గనుల శాఖ డిడి రాజశేఖర్, డిటిసి శ్రీధర్, సెబ్, పర్యావరణ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.