నాణ్యతతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టండి
1 min readవచ్చే వారానికి 250 సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి 35 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసి రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఈఈలు నాగరాజు, రఘురామిరెడ్డి, డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే నేపథ్యంలో ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి 35 సంవత్సరాల పాటు మన్నికగా వుండి గ్రామస్తులు మెచ్చుకొనే రీతిలో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి వచ్చే వారానికి 250 సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో 1023 సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను 842 గ్రౌండింగ్ కాగా 132 పూర్తి చేశామని వచ్చే వారానికి ప్రగతి కనపడాలన్నారు. సంక్రాంతి పండుగలోపు సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు పనుల్లో వేగం పెంచాలన్నారు. సిమెంట్ రోడ్లకు క్యూరింగ్ చేయడంతో పాటు రోడ్ల చివరన ఎత్తు పల్లాలు లేకుండా గ్రావెల్ తో నింపాలన్నారు. ఇంకా ప్రారంభించని సిమెంట్ రోడ్ల నిర్మాణాలు ఈ వారం గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ ఆదేశించారు. పాణ్యం, బేతంచెర్ల మండలాలు గ్రౌండింగ్, కంప్లీషన్ లో వెనుకబడి ఉన్నాయన్నారు. చేపట్టిన నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో చక్కగా కనబడుతున్నాయని మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.