మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించండి
1 min readసచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్బన్ సచివాలయ సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, డిఎల్డిఓ శివారెడ్డి, పరిశ్రమల జిల్లా మేనేజర్ జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించేందుకు వనమిత్ర పేరుతో ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిందని ఇందుకోసం 9552300009 మొబైల్ నెంబర్ వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించేందుకు సిద్ధం కావాలని తెలిపారు. తొలి దశలో 161 ప్రభుత్వ సేవలను అందించనుందని భవిష్యత్తులో 500 రకాల సర్వీసులకు పొడిగిస్తోందని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవల వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన పొంది అమలు చేయాలన్నారు. ప్రస్తుతం దేవాదాయ, పిజిఆర్ఎస్, ఏపీఎస్ఆర్టీసీ, ఎనర్జీ సర్వీసెస్, మునిసిపల్, రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్ శాఖలకు సంబంధించిన సేవలను ప్రారంభించారని వాట్సాప్ ద్వారానే సర్వీసులను అందించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో తొమ్మిది రకాల సర్వేలను సచివాలయ సిబ్బంది చేస్తున్న నేపథ్యంలో డేటా బేస్ పక్కాగా ఉంటే పాలన సంస్కరణలకు ఉపయోగపడుతుందని తప్పుడు డేటాను నమోదు చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎంఎస్ఎంఇ యూనిట్ల సర్వేలకు సంబంధించి పట్టణ ప్రాంతాలలో 30 వేల యూనిట్లు పెండింగ్ లో ఉన్నాయని త్వరితగతిన సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్తిచేసిన ఎంఎస్ఎంఈ సర్వే యూనిట్లలో 7,285 యూనిట్లు వినియోగంలో లేనట్లు నివేదించారని మరోసారి సరిచూసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఎంఎస్ఎంఈ సర్వే యూనిట్ల అన్నిటిని కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ కమర్షియల్ కనెక్షన్ ఉన్న ప్రతి సంస్థను కూడా ఎంఎస్ఎంఇ యూనిట్ గా పరిగణించి సర్వే నిర్వహించాలన్నారు. పెండింగ్ లో ఉన్న హౌస్ హోల్డ్ డేటాను క్యాప్చరింగ్ చేసి జియో కోఆర్డినేట్ చేయాలన్నారు. మిస్సింగ్ ఎంప్లాయిస్ హౌస్ హోల్డ్ డేటాను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక పరస్పర వ్యవసాయ సంఘాల లబ్ధిదారుల ఈ కేవైసీ ని కూడా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.