టీకాతో…ఆరోగ్యం సురక్షితం..
1 min readరోగ నిరోధక శక్తిని పెంచేది.. వ్యాక్సిన్ మాత్రమే..
- చిన్నారుల జబ్బులపై.. నిర్లక్ష్యం తగదు..
- నవంబర్ 10న అంతర్జాతీయ రోగనిరోధక దినోత్సవం
కర్నూలు, పల్లెవెలుగు:ఆధునిక ప్రపంచంలో చిన్నారులను జబ్బుల బారి నుంచి కాపాడుకోవడం ఒక సవాల్ గా మారింది. తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు కలుషితం కావడంతో గ్రామీణ , పట్టణ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లలను కాపాడేది వ్యాక్సిన్ మాత్రమే నని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా పసిపిల్లల నుండి చిన్నారుల వరకు వారికి వచ్చిన జబ్బులపై, ఇతర సమస్యలపై నిర్లక్ష్యం చేయకూడదని వెల్లడిస్తున్నారు. పుట్టిన బిడ్డ నుంచి నెలల వారీగా వేసే వ్యాక్సిన్ల గురించి పిల్లల తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. నవంబరు 10న అంతర్జాతీయ రోగ నిరోధక దినోత్సవం సందర్భంగా పిల్లల ఆరోగ్యం పై టీకాల పాత్ర కీలకమని వెల్లడించారు.
ఆరోగ్యం.. సురక్షితం..
పసి పిల్లల నుంచి బిడ్డ వరకు అవసరమైన టీకాలు ( వ్యాక్సిన్లు ) వేసుకోవాలని, ఇది పిల్లలకు, తల్లుల ఆరోగ్యానికి ఎంతో రక్ష అని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. టీకాలు వేయడం ద్వారా చిన్నపిల్లలు బలహీనపడుతారని, వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. కానీ టీకాలు వేయడం ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పోలియో, ఇతర అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.
టీకాపై అవగాహన
ప్రజల్లో టీకాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ని నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలకు టీకాల మీద అవగాహన పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతారు. ఈ సంవత్సరం “ప్రతిఒక్కరికి సాధ్యమే – టీకాలు అందరికీ అందాలి.” అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారు. టీకాలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడతాయి. పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయడం వల్ల.. వారిని ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడిన వారమవుతామని చిన్న పిల్లల వైద్య నిపుణులు వెల్లడించారు.
అందుబాటులో… వ్యాక్సిన్లు
పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల పరిధిలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచింది. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి… టీకా వేయాల్సి ఉంటుంది. తట్టు, కోరింత తగ్గు, క్షయ, పోలియో తదితర వ్యాధులు పిల్లలకు సోకకుండా ఉండేందుకు టీకాలు వేస్తారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
పిల్లల భవిష్యత్ కోసం… టీకా అవసరం..
- డా. విజయ వాణి, చిన్న పిల్లల వైద్య నిపుణులు, అమీలియో హాస్పిటల్, కర్నూలు
పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం టీకా వేయడం అత్యవసరం. టీకాల వల్ల దాదాపు 80 శాతం రోగాలు
దరిచేరవు. ఐదేళ్లలోపు పిల్లలకు టీ.టీ. ఇంజక్షన్ వేయాలి. క్షయ వ్యాధి, పోలియో వంటి వ్యాధులు
రాకుండా.. వైద్యుల సలహా మేరకు టీకాలు వేసుకోవాలి. 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్.పి.ఎన్. వ్యాక్సిన్ వేయడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎం.ఎం. ఆర్ టీకా వేయడం వల్ల తట్టు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు టీకా వేయడం వల్ల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి పసిపిల్లల నుంచి బిడ్డ వరకు అవసరమైనంత వరకు టీకాలు వేసుకుంటే.. పిల్ల ఆరోగ్యం సురక్షితంగా
ఉంటుంది
ప్రజలను ప్రోత్సహించాలి
- డాక్టర్. హెచ్. ఏ. నవీద్ , కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ , కిమ్స్ కడల్స్,
టీకాలు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా చాలా వరకు వ్యాక్సిన్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. టీకాలను సాధారణ ప్రజలకు ఉపయోగించే ముందు వాటి భద్రత కోసం టీకాలు చాలా రకాలుగా పరీక్షించబడతాయి. నొప్పి, జ్వరం వంటి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి, ఇవి కొన్ని రోజుల్లో తగ్గుతాయి.