వాడవాడలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు
1 min readరాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. మంగళవారం “హర్ ఘర్ తిరంగా” సందర్భాన్ని పురస్కరించుకొని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో టేక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి జండా ఊపి మంత్రి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఎ.పద్మజ, జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని… ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాధలను గుర్తుచేసుకుని దేశ అభివృద్ధికి పనరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో కులాలు, మతాలు, విభిన్న జాతులు మమేకమై దేశ పురోభివృద్దికి పాటుపడాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ కాపాడాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేలా పిలుపునిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సీఎం ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర దిశా నిర్దేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలో నిర్వహించిన భారత జాతీయ జెండా భారీ ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, జిల్లాధికారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకోవడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగనిరతిని, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. హమారా సంకల్ప వికసిత్ భారత్ నినాదంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీ వరకు వాడవాడలా విజయవంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో 100 మీటర్ల జాతీయా పతాకంతో టేక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. (www.harghartiranga.com) హర్ ఘర్ తిరంగ వెబ్సైట్లో ప్రతి ఒక్కరు జాతీయ జెండాతో సెల్ఫీ దిగి అప్లోడ్ చేసి సర్టిఫికెట్ కూడా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అధికారి సత్యనారాయణ, ఆర్టీవో శివారెడ్డి, డిసిహెచ్ఎస్ జఫ్రూళ్ళ తదితరులు పాల్గొన్నారు.