విజయసాయి రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: (అనంతభూమి) రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సిపి నేత విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ అసోసియేషన్ సభ్యులు కే రాజగోపాల్ లు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తమ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పై అసందర్భ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ శాఖకి చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె మాజీ భర్త మదన్మోహన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.తమ డిపార్ట్మెంట్ కు చెందిన ఆసిస్టెంట్ కమిషనర్ శాంతి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆమె మాజీ భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ ను సంప్రదిస్తే వ్యక్తిగత విషయాలకు శాఖకు సంబంధం లేదని సున్నితంగా తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. మదన్మోహన్ ఫిర్యాదు బయటకు ఏ విధంగా బహిర్గతమైందో విజయ్ సాయి రెడ్డి తెలుసుకోవాలన్నారు. అలా కాకుండా తమ శాఖ కమిషనర్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్న సంగతి గుర్తించుకోవాలని అన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ కు విజయసాయి రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.