కలెక్టరేట్ లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి
1 min readవిశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విరాట్ విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్బంగా మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్ధలో కుల వృత్తులు ఎంతో కీలకమైనవన్నారు. సంప్రదాయ కళా వైపుణ్యాలను కలిగిన వారికి ప్రయోజనం కలిగించే విధంగా ముఖ్యంగా బంగారు పనివారు, కమ్మరి పనివారు, నేతన్నలు, తాపీ పనివారు, కుమ్మరి పనివారు ఇలా వివిధ నైపుణ్యాలు కలిగిన కుటుంబాల వారికి విశ్వకర్మ యోజన ద్వారా ప్రభుత్వం సాధికారిత కల్పించేందుకు కృషిచేస్తుందన్నారు. అలాంటి సంప్రదాయ వృత్తులు నిర్వహించడం గొప్ప పని అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్బంగా అటువంటి కుటుంబాలకు, కళాకారులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడే దిగివచ్చిన విధంగా విగ్రహాలను చెక్కే నైపుణ్యం కలిగిన కళాకారులు ఎంతోమంది ఉన్నారన్నారు. ఈ సందర్బంగా ఆయా వృత్తులు నిర్వహిస్తున్న వారి సమస్యలను కలెక్టర్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు. విశ్వబ్రాహ్మణ నాయకుల సమస్యలను, సూచనలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరాం, ఎలబాక కృష్ణ, కేళ్ల దుర్గాప్రసాద్, కె.వి. బ్రహ్మం, తదితరులు మాట్లాడుతూ పంచవృత్తులు నిర్వహించే వారికి సరైన పనులులేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, తమ రంగంలోవున్న వారికి ప్రత్యేక క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వృత్తినైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. విశ్వకర్మ జయంతిని పబ్లిక్ హాలీడేగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వబ్రహ్మణులు అపర కర్మలు నిర్వహించకునేందుకు ఏలూరు నగరంలో కొంత స్ధలం కేటాయించాలని వారు కోరారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఆర్. డా:విజయరాజు, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, బి.సి. కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, జిల్లా బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, ఎపిఐఐసి జోనల్ మేనేజరు కె బాబ్జి, ఎపిఎంఐపి పిడి రవికుమార్, సెట్ వెల్ సిఇఓ ప్రభాకర్, డిసిహెచ్ ఎస్ డా:పాల్ సతీష్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, సర్వేశాఖ ఎడి పి. లక్ష్మణరావు, కలెక్టరేట్ ఎవో నాంచారయ్య, పలువురు విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరాం, ఎలబాక కృష్ణ, కేళ్ల దుర్గాప్రసాద్, కె.వి. బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.