ధనాపురం హొళగుంద రోడ్డు కోసం నేడు పాదయాత్ర
1 min readరోడ్డు బాగుంటే ఊరు బాగుంటుందని గ్రామాల నుండి ప్రజలు
నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: రోడ్డు బాగుంటే ఊరు బాగుంటుంది అన్న నినాదంతో ఆదోని నుండి హొళగుందకు రోడ్డు సౌకర్యం కల్పించేలా ధనాపురం హొళగుంద తారు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బి ఎస్ పి రాజకీయ పార్టీలు ఎమ్మార్పీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు హెబ్బటం గ్రామం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు గ్రామాల నుంచి తరలి వచ్చే ప్రజల భాగస్వామ్యంతో పాదయాత్ర జరగనుంది. 20 సంవత్సరాలకు పైగా రోడ్డు లేక హొళగుంద మండలం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని రోడ్డు సరిగా లేదు అన్న కారణంతో రాష్ట్ర చరిత్రలోనే ఏపీఎస్ఆర్టీసీ ఈ మండలానికి బస్సు నిలిపివేసిన దుస్థితి ఉందని ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి పాదయాత్ర ద్వారా పోరాటం చేసి రోడ్డును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుంతలతో ప్రయాణించడానికి వీలు లేకుండా మారిపోయిన రోడ్డుపై ప్రయాణం నిత్యం నరకమని ప్రతిరోజు రోడ్డు వల్ల వాహనాలు చెడిపోతూనే ఉన్నాయని రోడ్డు సరిగా లేకపోవడంతో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోజులు, నిత్య అవసరాల కోసం వెళ్లే ప్రజలు, వ్యాపారులు ఇతర వర్గాల వారు కమ్మరచేడు మీదుగా లేదా ఆలూరు మీదుగా చుట్టూ తిరిగి ఆదోనికి పోతున్నారని ప్రజలకు తెలియజేశారు. గతంలోనే రోడ్డు మంజూరు అయిందని పనులు ప్రారంభించి ఆర్భాటం చేసి అర్ధాంతరంగా ఆపివేశారని ప్రస్తుతం ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్కు పాత బకాయిలు చెల్లించామని రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తున్నారు కానీ ఇప్పటివరకు కనీస చర్యలు లేవని విమర్శించారు. ప్రజలకు రోడ్డు ఎంతో అవసరమైనందున అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి కాంట్రాక్టర్ తో మాట్లాడి రోడ్డు పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు యొక్క అవసరతను తెలియజేస్తూ ప్రజల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా హెబ్బటం గ్రామం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 20 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి నిరసన తెలియజేసి సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామని నాయకులు పత్తికొండ డివిజన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గుళ్ళెం ఎల్లప్ప, ఆదోని డివిజన్ అధ్యక్షులు పంచగుండగ వెంకటేష్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు రామాంజనేయులు ఉపాధ్యక్షులు నరసప్ప ఎమ్మార్పీఎస్ నాయకులు సినిమా మంగన్న, ముత్తయ్య,, పెద్ద హొతురు శంకర్ నరసప్ప దుర్గన్న తెలియజేశారు.