PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జలవనరుల శాఖ కు.. పూర్వ వైభవం తీసుకొస్తాం..

1 min read

హంద్రీ ద్వారా 1800 నుంచి 3,850 క్యూసెక్కుల నీటిని పెంచేలా చూస్తాం..

  • ఉచిత ఇసుకను.. సమర్థవంతంగా అమలు చేస్తాం..
  • ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టండి
  •  జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ర్ట జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు

కర్నూలు, పల్లెవెలుగు:  ఇది ప్రజల ప్రభుత్వం… యురేనియం తవ్వకాలకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రజలకు నష్టం కలిగే పని ఒకటి కూడా చేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ర్ట జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో  జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ర్ట జలవనరుల శాఖ మంత్రి వర్యుల ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం జరిగింది. వ్యవసాయం ఉద్యానం నీతిపారుదల తాగునీరు ఇసుక వైద్యం ఆరోగ్యం తదితర  అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయలసీమ అంటే రతనాల సీమగా పేరు ఉండేదన్నారు.. మంచితనానికి, నీతి, నిజాయితీగా ఉన్నటువంటి రాయలసీమ ముఖ ద్వారం అయిన కర్నూలు జిల్లాకు ఇన్చార్జి మంత్రి గా రావడం ఆనందంగా ఉందన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధులకు, వితంతువులకు రూ.4వేలు పింఛన్​, దివ్యాంగులక రూ. 6వేలు,  బెడ్ కి పరిమితమైన వారికి 15 వేల రూపాయలను ఇస్తున్నారన్నారు.. 16 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగిందన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఉన్నప్పటికీ  ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తూ,  అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు  అందిస్తున్నారన్నారు…   గత పాలనకు భిన్నంగా  ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 200 అన్న క్యాంటీన్ లను ప్రారంభించి పేదవాడి కడుపు నింపుతున్నామన్నారు..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్  రద్దు చేయడం జరిగిందన్నారు…దీపావళి కానుకకు పేద మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఈ ప్రభుత్వం యొక్క విధానమని, అధికారులందరూ ప్రజాప్రతినిధులతో కో ఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్లాలన్నారు…

ఉల్లి రైతులను ఆదుకుంటాం…

వ్యవసాయ పరంగా ఉల్లి, టొమాటో లాంటి పంట ఉత్పత్తులు ఎక్కువ పండించే జిల్లా అన్నారు.. కర్నూలు మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉల్లి తలమానికంగా ఉన్నటువంటి మార్కెట్ అని అటువంటి ఉల్లి రైతులు నష్ట పోకుండా, వినియోగదారులకు భారం కాకుండా, దళారుల పాలు అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 5 ఏళ్ల లో డ్రగ్, గంజాయి ఎక్కువ పెరిగిపోయాయని, అటువంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నామన్నారు…

వైసీపీ హయంలోనే… యురేనియం తవ్వకాలకు అనుమతి

2022లో గత ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు సంబంధించి సర్వేకి అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. తాము ప్రజల ఆమోదం లేకుండా ఏ పనీ చేయమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని ప్రజలకు నష్టం జరిగే పని ఒకటి కూడా చేయమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో లాగా ఈ ప్రభుత్వంలో  వేధింపులు అక్రమ అరెస్టులు ఉండవని, ప్రజల సంక్షేమం కోసమే తాము పని చేస్తామని మంత్రి పేర్కొన్నారు..

జలవనరుల శాఖకు పూర్వ వైభవం తెస్తాం…

జలవనరుల శాఖకు పూర్వ వైభవం తీసుకువస్తామని, రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చే సంవత్సర కాలంలో  హంద్రీ నీవా మీద 2800 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీ నీవా ద్వారా ప్రస్తుతం వస్తున్న   1800 క్యూ సెక్కుల నీటి  నుండి 3 వేల 850 క్యూ సెక్కులకు నీరు వచ్చే విధంగా  చర్యలు చేపడుతున్నామన్నారు..హంద్రీ నీవా మెయిన్ కెనాల్ లో నీరు ఎప్పుడైతే రెట్టింపు వస్తుందో, హంద్రీ నీవా మీద ఆధారపడినటి వంటి కర్నూలు, అనంతపురం, సత్య సాయి, హిందూపురం, చిత్తూరు జిల్లాలకు కూడా ఉపయోగం ఉంటుందన్నారు…..

హౌసింగ్​ పెండింగ్​ బిల్లులు క్లియర్​ చేస్తాం..

హౌసింగ్  కి సంబంధించి 2014 -16 లో  ఇళ్లు నిర్మించుకున్న వారి వివరాల నివేదికను రూపొందించాలన్నారు.. 2016-19 సంవత్సరంలో  ప్రభుత్వంలో  ఇళ్ళు నిర్మించుకున్న వారికి పెండింగ్ లో ఉండే బిల్లుల మంజూరుకు, అలాగే ఒక రూపాయితో ఇల్లు కట్టిన వారి వివరాలను చూసి వారికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  టిడ్కో ఇళ్ల నిర్మాణం పై మంత్రి అధికారులతో సమీక్షించారు.. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ఇళ్లను తాకట్టు పెట్టి ఐదు వేల కోట్లు  తీసుకొని నిధులను డైవర్ట్ చేశారని మంత్రి విమర్శించారు..

సోషల్​ మీడియాను వినియోగించుకోండి :మంత్రి టీజీ భరత్​

 రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ మాట్లాడుతూ పశుసంవర్థక, మార్కెటింగ్, వ్యవసాయం తదితర శాఖలకు సంబంధించిన పథకాల గురించి సోషల్ మీడియాలో, సిటి కేబుల్ ఛానల్ ల ద్వారా  ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు..

ఆదోని రైతులు నష్టపోతున్నారు : ఎమ్మెల్యే డా. పార్థసారధి

ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పత్తి మార్కెట్ యార్డు ఆదోనిలో ఉందన్నారు. అయితే వర్షం పడితే తగినన్ని  షెడ్లు లేక  బుడ్డల పంట కొట్టుకపోవడం మూడు సార్లు జరిగిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేదని, వర్షం వల్ల తడిసిన పంటను అరబెట్టుకోవడానికి తగిన షెడ్స్ లేవని, మార్కెట్ యార్డులో రైతులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఉన్న భవనం గత ఏడు సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మూతపడిందని ఎమ్మెల్యే తెలిపారు.  మార్కెట్ యార్డులో ఉన్న వ్యాపారులు, దళారులు రైతులకు అవసరమైన నగదును ఇచ్చి అదే రోజు అమ్మకం తరువాత వచ్చిన నగదును అసలుతో పాటు వడ్డీ రూపంలో కూడా కొంత మేరకు నగదు తీసుకోవడం జరుగుతుందని ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా మార్కెట్ యార్డులో బ్యానర్లు, ఫిర్యాదుల బాక్సలు, మైక్ లో తెలిపి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.. ఆదోని చుట్టూ ప్రాంతంలో జిన్నింగ్ మిల్లులో సరైన పత్తి బరువు చూసే మెషీన్లు లేకపోవడం వల్ల సరుకులో 50 కిలోల తక్కువ పత్తి తేడా చూపడం జరుగుతుందని రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేశారని,  తూనికలు కొలతల శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరారు.. మార్కెట్ యార్డులో ఉన్న వేయింగ్  మెషీన్లు ఆరు సంవత్సరాలుగా పని చేయడం లేదని,  మరమ్మత్తులు చేయించాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు.

కృష్ణా బోర్డును… విశాఖకు తరలించొద్దు.. : నాగరాజు , ఎంపీ

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కృష్ణా రివర్  మేనేజ్మెంట్ బోర్డును విశాఖపట్నంకు తరలించవద్దని, కర్నూలు లోనే బోర్డును ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని  జిల్లా ఇన్చార్జి మంత్రిని కోరారు. కర్నూలు మార్కెట్ యార్డ్ లో నిర్మాణంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ పనులు ఆగిపోయాయని, 30% పనులు మాత్రమే మిగిలిపోయాయని,  మిగిలిన పనులు చేయటానికి నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితే మిర్చి పంటను కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. జిల్లాలో మొత్తం నీటి నిలువలు 6 టీఎంసీలు మాత్రమే ఉన్నదని ఉన్నదని. ఇది జిల్లాకు ఏమాత్రం సరిపోదని,  80 టీఎంసీల శ్రీశైలం నీటిని పశ్చిమ ప్రాంతానికి ఇవ్వాలని కోరారు. గుండ్రేవుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి వలసలు నివారించాలని జిల్లా ఇన్చార్జి మంత్రిని కోరారు.

‘ జల జీవన్​ మిషన్​ ’ పూర్తి చేయండి : కేఈ శ్యాంకుమార్  , పత్తికొండ ఎమ్మెల్యే

పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్   మాట్లాడుతూ 2014 -19 కాలం లో తెలుగుదేశం ప్రభుత్వం 260 కోట్లు ఖర్చుపెట్టి చెరువులు నింపు కార్యక్రమం కు పనులు మొదలు పెట్టగా,  గత ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం ఏమి చేయకుండా వదిలేసిందని తెలిపారు. ప్రస్తుతం ఆ పైపులు లీకేజీ అయ్యి పొలాలు చెడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. పైప్ లైన్ ఆపరేషన్ మెయింటినెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.. హోసూరు వద్ద 1.50 కిలోమీటర్ దూరంలో  ఉన్న హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ ద్వారా 46 గ్రామాలకు త్రాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ మండల పుచ్చకాయల మడ గ్రామ సభలో చెప్పడం జరిగిందని తెలియజేశారు. జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కోరారు.

గుండ్రేవులను నిర్మించండి: గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ కెసి కెనాల్ ప్రాంత రైతులు ఎప్పుడు గుండ్రేవుల రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. దీని వల్ల కర్నూలు పట్టణానికి త్రాగు నీరు, రైతులకు సాగు నీరు ఇబ్బంది లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలన్నారు. అదేవిధంగా హంద్రీ కి పంపింగ్ చేసిన 23 టిఎంసి నీటిలో 10 టిఎంసి నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కు కేటాయించాలని కోరారు. 80 వేల ఆయకట్టు ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కు 40 వేల ఆయకట్టుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి కెఈ.కృష్ణమూర్తి హయంలో 104 చెరువులు నీరు నింపామని, తరువాత 68 చెరువులు, ఇప్పుడు 38 చెరువులకు కూడా నీరు నింపే పరిస్థితి ఉందన్నారు. అదే విధంగా ఓర్వకల్లు లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కాబోతుందని అందుకు అవసరమైన నీరు అందజేయాలని కోరారు. అందుకు తగిన తీర్మానం కూడా ఈ సమావేశంలో చేయాలని కోరారు. మైనింగ్ కు సంబంధించి కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో జెసిబి ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించడం జరుగుతుందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకొని రాగా అందుకు రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేసి సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్పీని అదేశించారు.

 కేసీ కెనాల్​ బండను మరమ్మతు చేయండి : బొగ్గుల దస్తగిరి, కోడుమూరు ఎమ్మెల్యే

కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ఎల్ ఎల్ సి వాటర్ కోడుమూరు నియోజకవర్గానికి సక్రమంగా రావడం లేదని కేసీ కెనాల్ బండ్ కు మరమ్మతులు చేయించాలని కోరారు. సుంకేసుల డ్యామ్ కిందకు 12 కిలోమీటర్ల వరకు ఇసుకతో లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. సమీక్షలో  జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, విజయ  డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి,   ఆదోని సబ్ కలెక్టర్  మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author