కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం
1 min readజూన్ 1 వ తేది నాటికి కౌంటింగ్ ఏజెంట్ల పేర్లు ఇవ్వాలి
కౌంటింగ్ హాల్ లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు
జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీలో ఉండే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లను ఫార్మ్ -18 ద్వారా నియమించుకోవాల్సి ఉంటుందని, ఏ టేబుల్ కి ఐతే కౌంటింగ్ ఏజెంట్ ను నియమించి ఉంటారో, ఆ టేబుల్ వద్దనే కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలన్నారు. ఒక ఏజెంట్ ను కేవలం ఒక టేబుల్ కి మాత్రమే కేటాయించుకోవలసి ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ టేబుల్ లకు కేటాయించడానికి లేదని రాజకీయ పార్టీల ప్రతినిధులకి కలెక్టర్ తెలిపారు.. జూన్ 1 వ తేది నాటికి కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలనుకుంటున్న వారి పేర్లను ఇచ్చినట్లయితే,వారికి ఫోటో ఐడి కార్డులు, టేబుల్ బ్యాడ్జ్ లు త్వరితగతిన ఇచ్చేందుకు వీలవుతుందని కలెక్టర్ తెలిపారు.. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ రోజున కచ్చితంగా వారిని నియమించిన లెటర్, ఐడి కార్డ్, డిక్లరేషన్ లెటర్ లు తీసుకొని రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. మొబైల్ ఫోన్లు లోపలికి ప్రవేశం ఉండదని, యూనివర్సిటీ లో పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ డిపాజిట్ సెంటర్ లో మొబైల్ ఫోన్లను పెట్టాల్సి ఉంటుందన్నారు.రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్, లైబ్రరీ బ్లాక్ లలో కౌంటింగ్ నిర్వహణకు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ, పార్లమెంట్ కి సంబంధించిన ఈవిఎం యంత్రాలను లైఫ్ సైన్స్ బ్లాక్ లో, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ, పార్లమెంట్ కి సంబంధించిన ఈవిఎం యంత్రాలను ఇంజనీరింగ్ బ్లాక్ లో, మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ, పార్లమెంట్ కి సంబంధించిన ఈవిఎం యంత్రాలను లైబ్రరీ బ్లాక్ లో భద్రపరచడం జరిగిందన్నారు.. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఫ్లోర్ ను ఒక నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని, సంబంధిత ఫ్లోర్ లోనే ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ కౌంటింగ్, అసెంబ్లీ సెగ్మెంట్ లోని పార్లమెంటు కౌంటింగ్ జరుగుతుందని, అందుకు గాను 2 కౌంటింగ్ హాల్ లను, 2 స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను గట్టి బందోబస్తు నడుమ పకడ్బందీగా రాయలసీమ యూనివర్సిటీలో మూడంచెల భద్రతతో భద్రపరచడంతో పాటు నిత్యం సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, అవసరమైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వెళ్లి చూసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లు ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ సబ్ ట్రెజరీ కార్యాలయాలలోని స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచడం జరిగిందని, కౌంటింగ్ కి ఒకటి లేదా రెండు రోజుల ముందే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ లను ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ సబ్ ట్రెజరీ కార్యాలయాలలోని స్ట్రాంగ్ రూమ్ ల నుండి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తీసుకొని వచ్చేందుకు చర్యలు చేపడతామని, ఎప్పుడు వెళ్తామనే తేది, సమయాన్ని నోటీస్ రూపంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకి తెలియజేయడం జరుగుతుందన్నారు. మరల రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కౌంటింగ్ రోజు ఉదయం 4 గంటలకే పోస్టల్ బ్యాలెట్ లను జిల్లా ట్రెజరీ కార్యాలయం నుండి రాయలసీమ యూనివర్సిటీ లోని కౌంటింగ్ హాల్ లోకి తీసుకొని రావడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభం అవుతుందని, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకే కౌంటింగ్ హాల్ లో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ సంబంధిత నియోజకవర్గాల అసెంబ్లీ కౌంటింగ్ హాల్ లోనే జరుగుతుందని, పాణ్యం, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 వేలు, 5 వేలు పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నందున ప్రత్యేక గదులను ఏర్పాటు చేసేందుకు అనుమతుల కొరకు ఎన్నికల కమిషన్ కి పంపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ లైఫ్ సైన్స్ బ్లాక్ ప్రత్యేక రూమ్ లో 14 టేబుల్స్ వేసి కౌంటింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ వి ఎమ్ కౌంటింగ్ కి సంబంధించి ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ లతో పాటు ఈవిఎమ్ లను తీసుకొని వచ్చేందుకు గాను అటెండర్ కూడా ఉంటారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. కౌంటింగ్ ప్రక్రియ 14 టేబుల్స్ మీద జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందుకు గాను అవసరమైన సిబ్బందిని నియమించుట కొరకు ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన సాఫ్ట్వేర్ లో రాండమైజేషన్ చేసి టీమ్ లుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఏ నియోజకవర్గానికి వారిని కేటాయించడం జరిగిందనే రాండమైజేషన్ జూన్ 3 వ తేది అబ్జర్వర్ సమక్షంలో జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డి ఆర్ ఓ మధుసూదనరావు , రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.