ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
1 min readఓర్వకల్లులో రూ.14వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ పూర్తి.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, ఇండియాకు చెందిన హైడ్రైస్ గ్రూప్, బి.ఎన్ గ్రూప్ లు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎం.ఓ.యూ కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. అమరావతిలో గత నెలలో మంత్రి నారా లోకేష్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై పెట్టుబడులు పెట్టే విషయంపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రూ. 14వేల కోట్ల ఈ భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఇండియాలో మొదటిసారిగా మన రాష్ట్రంలో ఏర్పాటుకానుందన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి భరత్ అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పెట్టబోయే ఈ భారీ సెమీ కండక్టర్ ప్రాజెక్టును రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే దిశలో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు రావడంతో పాటు మరిన్ని పరిశ్రమలు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్‌కు రానున్నాయాన్నారు. ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ వల్ల వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన ప్రాంతమన్నారు. మంత్రి నారా లోకేష్ దూరదృష్టితోనే ఈ భారీ ప్రాజెక్టు తీసుకురావడం సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక అభివృద్ధిని పెంచడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయన్నారు.