వర్షంలో ధాన్యం తడిచిపోకుండా రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నాం
1 min readజాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోకుండా రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు. ఫెంగల్’ తుఫాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పరిశీలించి పరిష్కరించే ఉద్దేశ్యంతో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి శనివారం జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు మండలాల్లోని పలు గ్రామాలలో అధికారులతో కలిసి పర్యటించి రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథపట్నంలోని పలువురు రైతులను కలిసి జేసీ మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా ఉండేందుకు రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామని, అవసరమైన రైతులు వారికి దగ్గరలోని రైతు సేవా కేంద్రాలలో సిబ్బందికి వివరాలు తెలిపి టార్పాలిన్లు పొందవచ్చన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకున్నదన్నారు. రైతులు తమకు దగ్గరలోని రైస్ మిల్లుకు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు. హమాలీలు, రవాణా, రైస్ మిల్లర్లతో ఏదైనా సమస్యలు ఏర్పడితే దగ్గరలోని రెవిన్యూ లేదా వ్యవసాయ శాఖాధికారులు దృష్టికి లేదా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004256453 కి ఫోన్ చేసి తెలియజేసినట్లైతే పరిష్కరిస్తారన్నారు. అనంతరం భీమడోలు, దెందులూరు మండలాల్లోని పలు గ్రామాలలో రైతులను కలిసి వారి సమస్యలను జేసీ అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట తహసీల్దార్ పూర్ణ ప్రసాద్, రెవిన్యూ, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.