విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం…రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readమెగా పిటిఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుంది
విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్
పల్లెవెగు వెబ్ కర్నూలు: విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలిసిన గొప్ప వేదిక మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఏ.క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో మంత్రి టి.జి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సమావేశం అవ్వడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం మంత్రి టి.జి భరత్.. విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు, వారి సూచనలు తెలుసుకున్నారు. కొంతమంది తల్లిదండ్రులు హాస్టల్లో వసతులు సరిగా లేవని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం లేదని, పరిసరాలు శుభ్రంగా లేవని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటిని ఒక నెల లోపల పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల హెడ్మాస్టర్, వార్డెన్‌ను మంత్రి ఆదేశించారు. సమస్య పరిష్కారం అవ్వకపోతే చర్యలు తీసుకుంటానన్నారు. ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం ఆర్బీఐలో ఉద్యోగం చేస్తున్న అఖిలశ్రీ అనే విద్యార్థినిని మంత్రి టి.జి భరత్ అభినందించారు. అఖిలశ్రీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
“బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్”వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి టి.జి భరత్.
మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అని యువతకు మంత్రి పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో యువత మత్తు పదార్థాలను వినియోగించకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన మరియు ఉపాధ్యాయుల పైన ఉందని మంత్రి అన్నారు. డ్రగ్స్ వాడడం వల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి యువతకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. డ్రగ్స్ నివారణ సహాయం కొరకు ఎప్పుడైనా 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునన్నారు. అనంతరం”బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్”వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. డ్రగ్స్ నివారణ పై పోలీస్ శాఖ వారు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదం చేయించి హాజరైన వారితో డ్రగ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ DEO హనుమంతరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, కార్పొరేటర్ పద్మలత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.