PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుజరాత్ తరహాలో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపరుస్తాం

1 min read

రాష్ట్ర  పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది  శాఖ మంత్రి  టి.జి.భరత్

పల్లెవెలుగు వెబ్ అమరావతి :   పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్  రాష్ట్రం  తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని  రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం ఉదయం 9.00 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో  రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పరిశ్రమల శాఖ అప్పజెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ది పర్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తామన్నారు. దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి తరలి వచ్చేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు.  పెండింగ్లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేస్తామన్నారు. 2014-19 మరియు 2019-24 మధ్యకాలంలో జరిగిన ఎంఓయూలన్నీ రియలైజ్ అయ్యేవిధంగా మరియు ఆయా పరిశ్రమలన్నీ రాష్ట్రంలో స్థాపించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కర్నూల్లో హైకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తనను ఆశీర్వదించిన కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కర్నూల్లోని ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు ఎక్కడికీ వెళ్లిపోవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన మంత్రి టి.జి. భరత్గురువారం ఉదయం 9.00 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో  రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా  టి.జి. భరత్ బాధ్యతలు చేపట్టారు.   అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్ లో  ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో  ఘనంగా  రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతోను అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా ఆ భగవంతునికి శోడషోపచార పూజలు జరిపిన  తదుపరి తమ సీటులో ఆసీనులయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు ఎండి యువరాజ్, అదనపు సెక్రెటరీ మోహన్ రావు మరియు పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖకు చెందిన పలువురు అధికారులు, ప్రముఖులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

About Author