PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం

1 min read

రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, నందవరం, ఓంకారం తదితర ప్రముఖ దేవాలయాలన్నింటినీ  సర్క్యూట్ గా తయారుచేసి టూరిజం ప్యాకేజీగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లు పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ అతిధి గ్రహంలో పర్యాటక రంగం అభివృద్ధిపై పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో అనేక ప్రముఖ దేవాలయాలు ఉన్నాయని… వాటన్నిటిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామన్నారు. దేవాలయాలతో పాటు ఆసియాలోనే రెండవ అతి పొడవైన బెలూం గుహలు, సుందరమైన బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలు ఈ డివిజన్ లోనే ఉన్నాయని ఎక్కడ అవసరమైతే ఆయా ప్రాంతాల్లో రిసార్ట్స్ నిర్మించేందుకు టూరిజం అధికారులతో సమీక్షించి స్థల సేకరణ నిమిత్తం చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీశైలం నందు 79 గదులతో ఉన్న రెస్టారెంట్ ను ఆధునీకరించడంతో పాటు 42 కొత్త గదులను 14.85 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. మహానందిలో 31 గదులతో, అహోబిలంలో 8 గదులతో రెస్టారెంట్ సౌకర్యం వుందన్నారు. అహోబిలంలో మరో 31 కొత్త గదులు, 4 డార్మెంటరీలు 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. ఉన్న వాటిని అప్డేట్ చేసుకుంటూ డిమాండ్ ను బట్టి రిసార్ట్స్ నిర్మిస్తామని మంత్రి తెలిపారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతో అహోబిలం టెంపుల్ ను CDBT ( challenge Based Destination Development a sub scheme of Swadesh Darshan) 2.50 కోట్లను ఆమోదిస్తూ పది శాతం నిధులను విడుదల చేశారన్నారు. నంద్యాల జిల్లాను ప్రధాన కేంద్రంగా తీసుకొని పర్యాటకులందరినీ ఆకర్షించేలా ఒక రిసార్ట్స్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు లేమి ఉన్నప్పటికీ పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లను భాగస్వామ్యం చేసి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామన్నారు. అటవీ, దేవాదాయ, పర్యాటక ఇతరత్రా శాఖలను అనుసంధానం చేసి అందరి అభిప్రాయాలు సేకరించడంతోపాటు పెట్టుబడిదారులను ఆహ్వానించి పర్యాటక రంగ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి వివరించారు.రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పొటెన్షియల్ జిల్లా అని శిల్పారామం తో పాటు టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక మంత్రిని సూచించారు. నవనందులు, నవ నరసింహులు, శిలాసంపద,  నల్లమల అటవీ సంపద తదితర ప్రాముఖ్యత గల ప్రదేశాలు జిల్లాలో వున్నాయని… వీటన్నిటిని అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాను టూరిజం రిసార్ట్ గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

About Author