ఉల్లి రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం …జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రైతులకు హామీ ఇచ్చారు.గురువారం గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామ పొలాల్లో ఉల్లి పంటను గ్రేడింగ్ చేస్తున్న రైతులతో కలెక్టర్ సంభాషించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉల్లి పంట గ్రేడింగ్ చేస్తున్న రైతు గోకారితో మాట్లాడుతూ ఎన్ని ఎకరాలలో ఉల్లిపంట సాగు చేస్తున్నారు? ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరాకు ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తుంది? అని ఆరా తీశారు..ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని, దాదాపు 90 నుండి 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతు తెలిపారు.. పంటకు మంచి ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు వీలవుతుందా అని కలెక్టర్ రైతులను అడిగారు.. ఎర్ర ఉల్లిగడ్డలు కాబట్టి వారానికి మించి నిల్వ ఉంచితే కుళ్లిపోతాయని, అందుకే వెంటనే అమ్మతామని రైతులు వివరించారు… ఉల్లి పంట.విక్రయాల గురించి కలెక్టర్ రైతులను ఆరా తీశారు. తాడేపల్లిగూడెంకు తీసుకెళ్తామని, అక్కడ తమ ఎదురుగానే వేలం పాడి ధరను నిర్ణయించడం వల్ల తమకు అనుకూలంగా ఉంటుందని, కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఎంత మేరకు ధర ఇస్తున్నారు అని చివరివరకూ తెలియడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు..ఈ అంశాన్ని పరిశీలించి, రైతులకు అనుకూలంగా ఉండేలా తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి,అధికారులు పాల్గొన్నారు.