PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనవరికి కొత్త అక్రిడేషన్లు ఇస్తాం…

1 min read

అక్రిడేషన్ల పాత జీవో ను సవరించి కొత్త జీవో ఇస్తాం

ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం

ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి

పల్లెవెలుగు వెబ్​  బాపట్ల:  రాష్ట్రంలోని జర్నలిస్టులకు జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చి తీరుతామని రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. మంగళవారం బాపట్లకు వచ్చిన ఆయనను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్ని అడిగి తెలుసుకున్నారు. iju అధ్యక్షుడు , తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఫోన్ లో మంత్రి తో మాట్లాడుతూ అనేక అంశాలను వివరించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే నేతలతో మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఆక్రిడేషన్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, గత ప్రభుత్వం అక్రిడేషన్ల జారీ కోసం ఇచ్చిన జీవో ను మార్పు చేస్తామని చెప్పారు. అందుకోసం కొత్త నిబంధనలకు సంభందించి నివేదిక తయారు చేస్తున్నామని, అందరితో మాట్లాడి త్వరలో ఫైనల్ చేస్తామని చెప్పారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే జర్నలిస్టుల కోసం పని చేసే సంఘాలకు కూడా ఆక్రిడేషన్ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు.. ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా 2018 లో సీఎం హోదాలో చంద్రబాబు జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధి కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టిన విషయాన్ని ఐవీ సుబ్బారావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి వైసీపీ ప్రభుత్వం ఆపివేసిన జర్నలిస్టుల ప్రమాద భీమా పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.  ప్రభుత్వానికి నిధులు ఇబ్బంది అయితే సొంతంగా నిధులు సమకూర్చి అయినా ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించి తీరుతామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అడిగి తెలుసుకొని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రిని కలసిన వారిలో ఐవీ సుబ్బారావు తో పాటు జాతీయ సమితి సభ్యులు సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు,బాపట్ల జిల్లా అధ్యక్షులు ch రాంబాబు బాపట్ల జిల్లా యూనియన్ నాయకులు శ్రీనివాస రావు స్థానిక జర్నలిస్టులు ఉన్నారు.

About Author