గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతాం
1 min readప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాం
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్
జిల్లాలో మొత్తం 369 కిలోమీటర్ల రహదారిలో గుంతలు పూడ్చేందుకు గాను 4.57 కోట్ల రూపాయలు మొదటి విడతగా మంజూరు
సంక్రాంతిలోపు గుంతలు లేని రహదారుల పనులు పూర్తి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆర్ అండ్ బి రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేటు వద్ద మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపి (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్) కార్యక్రమం కింద రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గుంతలు లేని రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేటు నుండి శ్రీనివాస నగర్ జంక్షన్ వరకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అధిక ట్రాఫిక్ ఉన్న ఈ జంక్షన్లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ చేసి ఇచ్చారని వచ్చే బడ్జెట్లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించుకుని ప్రారంభించడం జరుగుతుందన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కూడా మన జిల్లా వాసి అయినందున రోడ్ల అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కూడా స్థానిక శాసనసభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గుంతలు లేని రహదారుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలోని ఆర్ అండ్ బి రహదారుల్లోని గుంతలు పూడ్చేందుకుగాను ప్రభుత్వం 4.57 కోట్ల రూపాయలను మొదటి విడతగా మంజూరు చేసిందన్నారు. వచ్చేఏడాది జనవరి 15వ తేదీలోపు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 369 కిలోమీటర్ల రహదారిలో గుంతలు పూడ్చేందుకు గాను మొదటి విడతగా ప్రభుత్వం 4.57 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. సంక్రాంతి పండుగ లోపు రహదారుల్లోని అన్ని గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంజూరులు వస్తాయన్నారు. దీంతోపాటు పంచాయతీరాజ్, మున్సిపల్ రోడ్ల పనులు కూడా మంజూరు కావాల్సి ఉందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఈ కార్యక్రమం పై పర్యవేక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా గుంతలమయం లేని రోడ్లను తీర్చిదిద్దుకోవడం జరుగుతుందన్నారు. ఆర్.అండ్.బి రహదారులను గుంతలు లేని రహదారులుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, తదితర ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.