వైసీపీ నేతల కబ్జాలను నిరూపిస్తాం…
1 min readఎక్కడ గొడవలు జరిగినా మంత్రి టి.జి భరత్‌పై నెపం వేస్తున్నారు
నిరాధారమైన ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం
కేడిసిసి బ్యాంకులో డబ్బులు ఇప్పిస్తామని వైసీపీ నేతలు ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు
మీడియా సమావేశంలో వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా కార్పొరేటర్లు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లో ఎక్కడ గొడవలు జరిగినా రాష్ట్ర మంత్రి టి.జి భరత్‌పై నెట్టే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 23వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కటారి పల్లవి, ఆమె భర్త కటారి సురేష్‌లు చేసిన కబ్జాలపై తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. వీటిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో అనవసరంగా మంత్రి టి.జి భరత్‌పై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. మంత్రికి కర్నూలు అభివృద్ధిపైనే దృష్టి ఉంది తప్ప ఆయన ఎప్పుడూ అవినీతి, అక్రమాలను ప్రోత్సహించబోరన్నారు. కర్నూలు నగరంలో కుటుంబ గొడవలు జరిగితే కూడా మంత్రి టి.జి భరత్ చేయించినట్లు వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లు తమ విలువ కాపాడుకోవాలని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెడతామని తెదేపా కార్పొరేటర్లు హెచ్చరించారు. కర్నూల్లో వైసీపీ నేతలు ఎన్ని కబ్జాలు చేశారో నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. శ్రీరామ్ నగర్లో నిరుద్యోగులు ఉపాధి కోసం బంకులు వేసుకుంటే చిన్నారులు, మహిళల పేర్లు చెప్పుకొని వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. తాగుబోతుల గొడవలకు కూడా టిడిపి నేతలు కారణమంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పారు. ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన కబ్జాలన్నింటిపై తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని టిడిపి కార్పొరేటర్లు తెలిపారు.కటారి పల్లవి భర్త కటారి సురేష్ చేసిన కబ్జాలను బంకుల వద్దనే నిరూపిస్తామని చెప్పారు. కే.డి.సి.సి బ్యాంకులో డబ్బులు ఇప్పిస్తామని చెప్పి శ్రీరామ్ నగర్లో చాలా మంది వద్ద నుండి గ్రూపుల వారీగా రూ.2వేల చొప్పున కటారి సురేష్ వసూలు చేశారని నాయకులు అన్నారు. ఇంతవరకు వాళ్లకు డబ్బులు ఇవ్వలేదన్నారు. బాధితులందరినీ జిల్లా ఎస్పీ దగ్గరకు తీసుకెళతామన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేసేందుకు తాము రౌడీలం కాదన్నారు. ఇక కర్నూలు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మేయర్‌కు లేదన్నారు. మిగతా వార్డులకు నిధులు కేటాయించకుండా కేవలం తన ఒక్క వార్డుకు మాత్రమే ఆయన నిధులు కేటాయించుకున్నారన్నారు. మంత్రి టి.జి భరత్‌ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పరమేష్, క్రాంతికిషోర్, ఫరాజ్ ఖాన్, జకియా అక్సారీ, విజయకుమారి, కైపా పద్మలతా, తెలుగు యువత పార్లమెంట్ అద్యక్షుడు అబ్బాస్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గున్నామార్క్, స్వామిరెడ్డి, రామాంజనేయులు, సుంకన్న, ఖాదర్ బాషా, అకీమ్, క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.