రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మిస్తాం… స్పష్టం చేసిన ఏపీ సీఎం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పుచ్చకాయల మాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు పుచ్చకాయల మాడ గ్రామానికి వరాల జల్లులు కురిపించిన బాబు గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైందని, రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడమే టిడిపి లక్ష్యం అని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా పుచ్చకాయల మాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సాయం తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానంతో పెన్నా నదికి నీటిని మళ్లించి తద్వారా రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. అమరావతి నగరాన్ని నిర్మించి హైదరాబాదుకు మిన్నగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో గురు రాఘవేంద్ర గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అందుకు అవసరమయ్యే నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిందన్నారు. ఖజానాలో నయా పైసా మిగిల్చలేదని తెలిపారు. అలాగే రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులు భారాన్ని మోపి రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. వైసీపీ చేసిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేని అద్వాన్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నారు. వైసీపీ పై ప్రజల్లో ఏ ప్రభావం ఏర్పడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని పేర్కొన్నారు.