ప్రజల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readకర్నూల్లోని పలు ప్రాంతాల్లో మంత్రి టి.జి భరత్ ఆకస్మిక పర్యటన
ఎన్నికల హామీ మేరకు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి
రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు ఆదేశాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆకస్మికంగా పర్యటించారు. నగరంలోని 46వ వార్డు పరిధిలోని కె.వి.ఆర్ కాలేజీ వెనుక ప్రాంతమైన బాబూ జగ్జీవన్ రామ్ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో పర్యటించిన సందర్భంగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చానని మంత్రి తెలిపారు. అందుకే సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు తీర్చాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం కె.వి.ఆర్ కాలేజీ నుండి బంగారుపేట మీదుగా ఆనంద్ థియేటర్ వరకు ఉన్న రోడ్డు మార్గాన వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించి ఈ రోడ్డు మార్గం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అనంతరం ఆనంద్ థియేటర్ ఎదురుగా హంద్రి బ్రిడ్జి పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో వ్యర్థాలు డంప్ చేస్తున్నారని, రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుచేసి మంచి వాతావరణం ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. అనంతరం పాతబస్టాండులోని గడియారం ఆస్పత్రిని మంత్రి టి.జి భరత్ సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పదేళ్ల నుండి ఇక్కడ వైద్యులు లేక వైద్యం అందడం లేదన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే వైద్యుల నియామకం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాతబస్తీ వాసులకు ఎంతో ముఖ్యమైన గడియారం ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందుకు వెళుతున్నట్లు టి.జి భరత్ చెప్పారు. మంత్రి వెంట కార్పొరేటర్ పరమేష్, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, కర్నూల్ నగర మైనారిటీ అధ్యక్షుడు హమీద్, మహిళా నాయకురాలు సంజీవలక్ష్మి, మారుతీశర్మ, నాయకులు సురేష్, సమద్రాల శ్రీధర్, చేపల రమేష్, జూటూరు రవి, గణేష్ సింగ్, యూనుస్ బాషా, పలువురు బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.