ఇండస్ట్రియల్ హబ్‌తో వలసలు అరికడతాం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readయన్.డి.ఎ కూటమి పక్షాల నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి వలసలు అరికడతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్‌లో జరిగిన యన్.డి.ఎ కూటమి పక్షాల నాయకుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ఇరిగేషన్ మంత్రి కర్నూలు జిల్లాకు ఇన్చార్జిగా రావడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ వరదల్లో ఆయన కష్టపడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. ఇక ఎన్నికల సమయంలో కర్నూలు నియోజకవర్గంలో టిడిపి, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు. ఇక తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు పార్టీ సూపర్ 6 పథకాలు తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఎక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనంత పెన్షన్‌ను ఏపీలో ఇస్తున్నట్లు టి.జి భరత్ చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకుముందు ఆయన కర్నూలు మార్కెట్‌యార్డును సందర్శించారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో జరిగిన డి.డి.ఆర్.సి మీటింగ్లో పాల్గొన్నారు.