PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్టోబరు 14 నుండి పల్లె పండుగ వారోత్సవాలు

1 min read

రహదారులు,డ్రైయిన్లు పనులు చేపట్టి సంక్రాంతి నాటికి పూర్తి చెయ్యాలి

ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పల్లెవెలుగు  వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను సత్వరమే మొదలుపెట్టే దిశగా రాష్ట్రంలోని అన్ని పంచాయితీల్లో ఈనెల 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.  మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఈనెల 14 వ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న పల్లె పండుగపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 14వ తేదీ నుండి వారం రోజులపాటు పల్లె పండుగను ఘనంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు.  ఉపాధిహామీ పధకంలో మెటీరియల్ నిధులతో చేపట్టాల్సిన పనులపై ఈఏడాది ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13, 325 పంచాయితీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి చేసిన తీర్మానాలకు అనుగుణంగా పనులు ప్రారంభించాలన్నారు.  ఐదేళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేదిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, 3వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.  సుమారు రూ. 4,500 కోట్లతో ఉపాధి, ఆర్ధిక సంఘం నిధులతో పెద్దఎత్తున నిర్మాణ పనులు చేపట్టి వచ్చే సంక్రాంతి నాటికల్లా పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా అన్ని సమన్వయశాఖలు పనిచేయాల్సివుందన్నారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి పల్లెపండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తిస్ధాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నారు.  జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల పరిధిలో ఎన్ఆర్ఇ జిసి కింద పల్లె పండుగ వారోత్సవాల్లో సిసి రోడ్లు, డ్రైయిన్లు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.  స్ధానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా కార్యాచరణ ఖరారు చేస్తున్నామన్నారు.  జిల్లాలో ఆయా ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు ఇసుక సమస్య లేదని తెలిపారు.  అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అక్టోబరు 14 నుంచి వారం రోజులపాటు స్ధానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ పల్లెపండుగ వారోత్సవాలను పటిష్టమైన కార్యాచరణతో విజయవంతం చేయాలన్నారు.  ఉపాధిహామీ పధకం అమలు చేస్తున్న పనుల వివరాలను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, డ్వామా పిడి కె. వెంకట సుబ్బారావు, జిల్లా పంచాయితీ అధికారి కె. అనురాధ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ ఎన్ వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author