మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా విస్తృత అవగాహన కల్పించాలి
1 min readజిల్లా జాయింటు కలెక్టరు టి. రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి
జాయింట్ కలెక్టర్ చేతుల మీదగా గోడ పత్రికలు ఆవిష్కరణ
పాల్గొన్న పలుశాఖల అధికారులు
నవంబరు 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో విస్తృత ప్రచారం చేయాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సోమవారం స్థానిక కలెక్టరేటు పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవం వాల్ పోస్టర్లను జిల్లా జాయింటు కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ నుండి డిసెంబరు 10వ తేదీ వరకు జరిగే మహిళలను స్వేచ్ఛగా బ్రతకనిద్దాం, మహిళలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు పాఠశాలలు, కళాశాలలలో విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల, పట్టణ వారీగా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని, ముందుగా సమాచారం తెలియ చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచాలన్నారు. బాలికలు, మహిళలకు పూర్తి అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళలు, బాలికలు అత్యవసర, ఆపద, అనుమానం ఉన్నను 1098,112, 181 టోల్ ఫ్రీ నెంబర్లు ఫోన్ చేసి తెలియ జేసినట్లయితే వెనువెంటనే పరిష్కరించుటకు అవకాశం కలుగుతుందని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు, కెఆర్ సి డిప్యూటీ కలెక్టరు బి.శివనాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, డియల్డివో వై.దోసిరెడ్డి, జిల్లా ఐసిడియస్ అధికారి బి.సుజాతా రాణి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి బి.అరుణశ్రీ, డియస్ వో యన్.సరోజ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.శోభారాణి,వివిధ శాఖలు జిల్లా అధికారులు, ఐసిడియస్ నోడల్ అధికారి పి.విజయ లక్ష్మి, ఓయస్ఇ ధన లక్ష్మి, లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కందిబోయిన జ్యోతి, రాపర్తి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.