మానసిక ఒత్తిడితోనే..దీర్ఘకాలిక వ్యాధులు..
1 min readసైకో సోమాటిక్ వ్యాధులపై అవగాహన పెంచుకోండి..
- డా. వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ రిజిస్ట్రార్ రాధిక రెడ్డి
- కర్నూలులో దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు
కర్నూలు, పల్లెవెలుగు:మానసిక ఒత్తిడితోనే… శరీరంలో మార్పులు… దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయన్నారు డా. వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ రిజిస్ట్రార్ రాధిక రెడ్డి. శనివారం నగరంలోని మౌర్య ఇన్లో దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డా. వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ రిజిస్ట్రార్ రాధిక రెడ్డి, కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు , మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు, ఉపాధ్యక్షులు, ఆశాకిరణ్ హాస్పిటల్ అధినేత డా.బి. నాగిరెడ్డి నేతృత్వంలో దక్షిణ భారత వైద్యుల సదస్సు జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా .రాధిక రెడ్డి మాట్లాడుతూ సైకో సోమాటిక్ వ్యాధులు మహిళల్లో అధికమయ్యాయని, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ వ్యాధిని త్వరగ గుర్తించి వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఎంపీ డా. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీలో 19 పీజీ సీట్లు, 179 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు రావడానికి కృషి చేశానన్నారు. సదస్సులో సౌత్ జోన్ ఇండియా అధ్యక్షుడు డా. అభయ్ మట్కర్, వైస్ ప్రెసిడెంట్ ఉమా శంకర్, కార్యదర్శి డా. లోకేశ్వర రెడ్డి, సీఎంఈ చైర్ పర్సన్ పీఎస్ వీఎన్ శర్మ, ఏపీఎంసీ అబ్జర్వర్ డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలు డా. హరిప్రసాద్, డా. సుహృత్ రెడ్డి, సైంటిఫిక్ కన్వీనర్ డా. శంకర్ రెడ్డి, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మానసిక వైద్యులు పాల్గొన్నారు.