ఫ్యాక్టరీలను రాష్ట్రం నుంచి తరిమేసిన ఘనత వైసీపీదే
1 min readకర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
కర్నూలుకు చేరుకున్న నిరుద్యోగ చైతన్య యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పారిశ్రామికవేత్తలను తరిమేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నిరుద్యోగ యువత చేపట్టిన యాత్ర కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువకులు నగరంలోని గుమ్మజ్ ప్రాంతంలో టీజీ భరత్‌ను కలిసి మద్దతు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలోని నిరుద్యోగ చైతన్య యాత్ర కరపత్రాలను యువకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు సరైన ప్రోత్సాహం అందించలేదని మండిపడ్డారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన అమరరాజా కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరరాజా వంటి పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించేందుకు రాష్ట్రాలు ప్రత్యేక రాయితీ ఇస్తాయని.. కానీ ఏపీలో మాత్రం పారిశ్రామికవేత్తలకు సహకారం ఉండదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువైందన్నారు. ప్రతీ యేటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని అన్నారు. సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబుకు బాగా తెలుసని అన్నారు. ఆయన ముందు చూపు వల్లే నేడు హైదరాబాద్ ప్రపంచపటంలో నిలిచిపోయిందని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కర్నూలుకు పరిశ్రమలు తీసుకువస్తానని అన్నారు. పారిశ్రామికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో కంపెనీలు తీసుకువచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించేలా కృష్టి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా యువత గ్రహించి మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని టీజీ భరత్ కోరారు.