ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
1 min readఅర్బన్ లోకల్ బాడీ ఎన్నికల జనరల్ అబ్సర్వర్ పి.రాజబాబు
పల్లెవెలుగు, గూడురు;
మున్సిపల్, పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల జనరల్ అబ్సర్వర్/సెర్ప్ సీఈఓ పి.రాజబాబు సంబంధిత మునిసిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం గూడూరు నగర పంచాయతీలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను, పోలింగ్ సరళిపై చేస్తున్న ఏర్పాట్లను వ్యయ పరిశీలకులు వినీత్ కుమార్ తో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. గూడూరు నగర పంచాయతీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని, ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పోలింగ్ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వుండి భాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ మేరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల బరిలో వున్న అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని వ్యయ పరిశీలకులు వినీత్ కుమార్ అధికారులను సూచించారు. రిటర్నింగ్ అధికారి రవికుమార్, గూడూర్ ఎస్సై నాగార్జున తదితరులు వారి వెంట ఉన్నారు.