సరసమైన ధరలకే చేనేత వస్త్రాలు
1 min readచేనేత వస్త్ర ప్రదర్శన ద్వారా చేనేత కార్మికులకు జీవనోపాధి
జాయింట్ కలెక్టర్ ( సంక్షేమం మరియు ఆసరా) ఎస్. ఖాజా మొహిదీన్
పల్లెవెలుగు,కర్నూలు
సరసమైన ధరలకే అన్నిరకాల చేనేత వస్త్రాలు లభించునని జాయింట్ కలెక్టర్ ( సంక్షేమం మరియు ఆసరా) ఎస్. ఖాజా మొహిదీన్ పేర్కోన్నారు. నంద్యాలరోడ్డు నందుఉన్న దేవి ఫంక్షన్ ప్యాలెస్ లో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాల కార్యక్రమాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) ఎస్. ఖాజా మోహన్ గారు మాట్లాడుతూ చేనేత వస్త్ర ప్రదర్శన ద్వారా చేనేత పారిశ్రామికులకు మెండుగా ఉపాధి అవకాశాలు లభించిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం, వెంకటగిరి, బందరు, పట్టు చీరలు, పొందూరు ఖద్దరు, చీరాల డ్రస్ మెటీరియల్స్ మరియు చీరలు, మోరి డ్రెస్ మెటీరియల్స్, పసలపూడి శారీస్, గద్వాల్ పోచంపల్లి చీరలు, వరంగల్ డర్రీస్, డోర్ మేట్స్, టవల్స్, లుంగీలు మరియు ఇతర అనేక రకములైన చేనేత వస్త్రాలు సరసమైన ధరలకే లభించునన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు అన్ని సెలవు దినములలో కూడా తెరవబడి ఉంటుందన్నారు. ప్రస్తుత ఎండాకాలంలో చేనేత వస్త్రాలు ధరించడం వల్ల మనిషి యొక్క బాడీ హీట్ ఎక్క కుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన యందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాక తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి 40 నుండి 50 ప్రాథమిక చేనేత సహకార సంఘములు చేనేత పారిశ్రామిక సభ్యుల ద్వారా తయారు చేయబడిన చేనేత ఉత్పత్తులను అమ్మకము నిమిత్తం 40 నుండి 50 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని చేనేత వస్త్ర ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేసి చేనేత కార్మికుల జీవనోపాధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు సిహెచ్. లక్ష్మణ్ రావు, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, అభివృద్ధి అధికారులు నరసింహారెడ్డి, చేనేత జౌళి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.