కోవిడ్ వ్యాక్సిన్ వికటించి…? అంగన్వాడీ ఆయా మృతి
1 min read – పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు షేక్షావలి
పల్లెవెలుగు, కర్నూలు
నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన అంగన్ వాడి వెల్పర్ (ఆయా) నూర్జహాన్ ( 55) ఈ నెల 15 న (సోమవారం) కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండు రోజుల తరువాత 17వ తేదీ వాంతులు, విరేచనలు, జ్వరం రావడంతో నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. 17వ తేదీ నుంచి చికిత్స పొందిన ఆమె.. కోలుకోలేక సోమవారం మృతి చెందింది. తల్లి నూర్జహాన్.. కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్లే చనిపోయిందని ఆమె కుమారుడు షేక్షావలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రతి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డిని ఫోన్లో మాట్లాడగా… నూర్జహాన్ మలేరియా తో మృతి చెందిందని, రికార్డుల ప్రకారం చెబుతున్నానని వెల్లడించాడు. కాగా కోవిడ్ వ్యాక్సిన్‌తో అస్వస్థతకు గురైన వారికి అన్ని వసతులతో 20 బెడ్లతో కూడిన ప్రత్యేక వార్డులో చికిత్స అందించాల్సి ఉంది. కానీ కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రతిలో నూర్జహాన్‌కు బూత్ బంగ్లాలో కింద వార్డు( కరోనా అనుమానితులకు చికిత్స అందించే వార్డు)లో వైద్యచికిత్సలు చేసినట్లు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నూర్జహాన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులు ఆరోపించారు.
సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
నూర్జహాన్ మృతదేహాన్ని నందికొట్కూరుకు తరలించగానే.. అక్కడ సీపీఎం ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో మృతదేహం ఉంచి.. నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అవాంఛనీ ఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.