PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రణాళికతో ముందుకెళ్లండి

1 min read
సమావేశంలో మాట్లాడుతున్న కర్నూలు జిల్లా కలెక్టర్​ జి. వీరపాండియన్​

సమావేశంలో మాట్లాడుతున్న కర్నూలు జిల్లా కలెక్టర్​ జి. వీరపాండియన్​

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా నిర్వహించాలి..
– సమన్వయం..సహకారంతో విజయవంతం చేయాలి
– శ్రీశైల దేవస్థాన అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు, కర్నూలు/శ్రీశైలం;
శ్రీ శైల మహా పుణ్యక్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండ జిల్లా అధికారులందరూ చక్కటి సమన్వయం, కమ్యూనికేషన్, పరస్పర సహకారంతో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ జి. వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయ సమావేశ భవనంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై రెండవ కో ఆర్డినేషన్ సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్పతో కలిసి దేవస్థాన, జిల్లాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మురళి, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు ఈ సమీక్ష సమావేశంపాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ శ్రీశైల మహాక్షేత్రంలో కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పక పాటిస్తూ భక్తులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా.. గత సంవత్సరం నిర్వహించిన తరహాలోనే అన్ని ఏర్పాట్లు పకడ్బందీ వ్యూహాత్మక ప్రణాళికతో చేపట్టాలని దేవస్థాన, జిల్లా అధికారులను ఆదేశించారు. మార్చి 4 నుండి 14వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల 5 రాష్ట్రాల నుండి భక్తులు శ్రీశైలం రానున్న నేపథ్యంలో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వచ్చే నెల 11వ తేదీ మహాశివరాత్రి, పర్వదినాన్ని పురస్కరించుకొని మహాన్యాస రుద్రాభిషేక లింగోద్భవం, రాత్రిపాగాలంకరణ, కల్యాణోత్సవం, గ్రామోత్సవం, రథోత్సవం తదితర అన్ని ఉత్సవాలను ఆలయ సంప్రదాయం ప్రకారం, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని శ్రీశైల దేవస్థాన ఈఓ కె.ఎస్.రామారావును సూచించారు.
టెండరు పిలిచి.. వర్క్​ కేటాయించాలి..

  • కోవిడ్ ను మనసులో ఉంచుకొని ఏర్పాట్లు చేయడంతో పాటు ఏర్పాట్ల కోసం చేపట్టే పనులు, మెటీరియల్ నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ లు పిలిచి వర్క్ లు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.త్రాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, బారికేడ్లు, క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, రవాణ తదితరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దేవస్థాన ఈఓ,
    సంబంధిత అధికారులను ఆదేశించారు.
    మినహాయింపు..ఉండదు..
    ఎన్నికలు, శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎలాంటి మినహాయింపులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చేనెల 10వ తేదీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు శ్రీశైలం రావాలని కలెక్టర్ ఆదేశించారు.
    మొబైల్స్​ టవర్స్​ పెంచండి..
    మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో మొబైల్స్ టవర్ల సామర్థ్యాన్ని పెంచాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అక్రమ సారా, మద్యానికి తావివ్వకుండా బార్డర్ చెక్ పోస్టుల్లో కఠినతరం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాలు అధిక ధరలకు అమ్మకుండా ముందుగా షాప్ కీపీర్లతో సమావేశాలు నిర్వహించి నియంత్రియించాలని గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజి, డిఎస్ఓ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
    32 ప్రాంతాల్లో.. వైద్యశిబిరాలు
    కోవిడ్ టెస్టింగ్ టీంలు, గుర్తించిన 32 ప్రదేశాల్లో మెడికల్ వైద్య శిబిరాలు, 200 మంది వైద్య సిబ్బంది, ఐదు 108 అంబులెన్స్ లు, కోవిడ్ మెటీరియల్ ను అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. అవసరమైన అన్ని ప్రదేశాల్లో పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను సూచించారు. రోడ్ ప్యాచింగ్, కొత్తగా రోడ్ నిర్మించి వేసిన స్పీడ్ బ్రేకర్ లకు పెయింటింగ్, మలుపుల దగ్గర గుర్తింపు సూచికలు, మిర్రర్ లను ఏర్పాటు చేయాలన్నారు.
    ఎన్నికలు.. ఉత్సవాలు.. ఒకే సారి..
    అనంతరం ఎస్పీ కె. ఫకీరప్ప మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు, ఎన్నికలు ఏక కాలంలో వస్తున్నందున ఛాలెంజ్ గా తీసుకొని పోలీసు శాఖ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని దేవస్థాన ఈఓను ఎస్పీ సూచించారు. నేరస్తులను గుర్తించి అరికట్టేందుకు క్రైమ్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. శివరాత్రి రోజు పాగాలంకరణ పూర్తయిన వెంటనే వెహికల్ మూవ్మెంట్ క్లియర్ చేయడానికి అధిక బస్సులు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పోలీసు అధికారులతో సహకరించి శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి,అమ్మవార్ల చిత్రపటాలను దేవస్థాన ఈఓ అందచేశారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, శ్రీశైలం దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

About Author