‘మున్సిపల్’కు సర్వం సిద్ధం
1 min readఓటర్లు .. ఓటును నిర్భయంగా వినియోగించుకోండి
– కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు, కర్నూలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు, నగర పంచాయితీ అయిన గూడూరులో మార్చి10న అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ సిద్ధంగా ఉన్నామని, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్, ఎన్నికల సన్నద్ధత, మునిసిపాలిటీలలో మోడల్ కోడ్ అమలుపై జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నగర పంచాయతీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అదే విధంగా జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగిందన్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న జిల్లాలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక వేళ అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందన్నారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 5,14,555, మహిళ ఓటర్లు 5,33,628, ఇతరులు 300 మందితో మొత్తం కలిపి 10,48,483 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 302 వార్డులు, 80 రూటు లు, 39 సేక్టర్ లు, 979 పోలింగ్ స్టేషన్లలో హైపర్ సెన్సిటివిటీ పోలింగ్ కేంద్రాలు 302, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 288, నార్మల్ పోలింగ్ కేంద్రాలు 389 కలవని అందులో వీడియో గ్రాఫర్ లతో పాటు వెబ్ కాస్టింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ నియమావళిని గట్టిగా పాటించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆర్ ఓలు 92, అడిషనల్ ఆర్ ఓ లు 77, అసిస్టెంట్ ఆర్ ఓ లు 134 మందితో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్లు 1179, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 1179, పోలింగ్ ఆఫీసర్ లు 3849 మందితో కలిపి మొత్తం 6207 మంది అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలలో విధులు నిర్వహిస్తారన్నారు. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలలో ఫిర్యాదుల స్వీకరణకు కమాండ్ కంట్రోల్ రూమ్ తోపాటు వాట్సాప్, మెయిల్, టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ తోపాటు గూడూరు నగర పంచాయతీలో మోడల్ కోడ్ అమలు ఉంటుందన్నారు. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలలో ఎంట్రీ, ఎగ్జిట్ లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. బయటి నుంచి వచ్చే కొత్త వ్యక్తుల పై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. అదే విధంగా బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక అర్బన్ ఏరియాలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పాత్రికేయుల సమావేశంలో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, సమాచార శాఖ ఉపసంచాలకులు పి.తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.