వైద్యులకు ఆరాధ్యుడు.. డా.బి.సి. రాయ్
1 min readఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్.శ్యాంప్రసాద్
– కర్నూలు వైద్య కళాశాలలో డా.బి.సి.రాయ్ విగ్రహ ఆవిష్కరణ
పల్లెవెలుగు, కర్నూలు హాస్పిటల్
వైద్యవిద్యార్థులకు, వైద్యులకు ఆరాధ్యుడు డా.బి.సి. రాయ్( బిదాన్ చంద్ర రాయ్) అని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్.శ్యాంప్రసాద్ అన్నారు. ఆదివారం కర్నూలు వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.సి. రాయ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తరువాత 1977వ బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేసిన కర్నూలు వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన కాన్ఫరెన్ హాల్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్.శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన డా.బి.సి. రాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించిన వ్యక్తి డా.బి.సి.రాయ్ అని, ఆయన జన్మదినాన్ని జాతీయ వైద్యుల దినోత్సవం జూలై 1 న జరుపుకుంటున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్.శ్యాంప్రసాద్ గుర్తు చేశారు. వైద్య విద్య, వృత్తిని దైవంగా భావించి.. నిరంతరం ఆధునిక టెక్నాలజీని జోడించి వైద్య వృత్తిలో రాణించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎంఈ, గుండె జబ్బుల విభాగాధిపతి డా. పి. చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. నరేంద్రనాథ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా. జిక్కి తదితరులు పాల్గొన్నారు.