PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాపార దిగ్గజం.. కిశోర్​ బియాని

1 min read

– రెడీమేడ్ బ‌ట్టలు త‌యారు చేసే వ్యక్తి .. వేల కోట్ల అధిప‌తిగా ఎలా ఎదిగాడు..?
– భారత వ్యాపారులకు మార్గదర్శి
ప‌ల్లెవెలుగు వెబ్: కిషోర్ బియానీ… భార‌త రిటైల్ వ్యాపార దిగ్గజం. ఆర్గనైజ్డ్ రిటైల్ వ్యాపారానికి ఆద్యుడు. నూత‌న ఆలోచ‌న‌ల‌తో వ్యాపారాన్ని కొత్తపుంత‌లు తొక్కించి.. భార‌త వ్యాపారుల‌కు మార్గద‌ర్శిగా నిలిచాడు. సాధార‌ణ రెడీమేడ్ బ‌ట్టలు త‌యారు చేసే స్థాయి నుంచి వేల‌కోట్ల విలువ గ‌ల ఫ్యూచ‌ర్ గ్రూప్ ను స్థాపించాడు. కిషోర్ బియానీ ముంబై హెచ్ఆర్ కాలేజీ నుంచి డిగ్రీ ప‌ట్టా పొంది.. సాంప్రదాయ కుటుంబ వ్యాపారంతో త‌న జీవితాన్ని ప్రారంభించారు.
రిటైల్ రంగానికి మార్గద‌ర్శకుడు : 1980లో కిషోర్ బియానీ వ్యాపార జీవితం ప్రారంభ‌మైన‌ప్పటికీ.. రిటైల్ బిజినెస్ మాత్రం 1990లో ప్రారంభించారు. క‌ల‌క‌త్తాలో పాంట‌లూన్స్.. బిగ్ బ‌జార్ ప్రారంభంతో ఆయ‌న రిటైల్ బిజినెస్ ప్రారంభ‌మైంది. ఫ్యూచ‌ర్ గ్రూప్ పేరుతో ఎఫ్ఎంసీజి స‌రుకుల‌ను బిగ్ బ‌జార్లలో అమ్మారు. త‌న లాభాల‌ను కాపాడుకుంటూ… వినియోగ‌దారుల‌కు సర‌స‌మైన ధ‌ర‌లకే నాణ్యమైన వ‌స్తువుల‌ను అమ్మారు. దీంతో ఈ త‌ర‌హా బిజినెస్ విధానానికి ప్రజ‌ల్లో మంచి స్పంద‌న వ‌చ్చింది. అప్పటికే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న కంపెనీల‌కు కిషోర్ బియానీ రిటైల్ వ్యూహం ఇబ్బందిక‌రంగా మారింది. ఫ్యూచ‌ర్ గ్రూప్ లో మరిన్ని కొత్త బ్రాండ్లను కిషోర్ బియానీ ప్రవేశ‌పెట్టారు. బిగ్ బ‌జార్, సెంట్రల్, ఫుడ్ బ‌జార్, పాంట‌లూన్స్ పేరుతో దేశ‌మంతా రిటైల్ స్టోర్స్ ను ప్రారంభించారు. అప్పటి వ‌ర‌కు సంప్రదాయ ప‌ద్ధతిలో సాగిపోతున్న రిటైల్ బిజినెస్.. కిషోర్ బియానీ రాక‌తో కొత్త పుంతలు తొక్కింది. కిషోర్ బియానీ చూపిన మార్గంలో ప‌లు కంపెనీలు ఆర్గనైజ్డ్ రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. వ్యాపారంలో పోటీ తీవ్రంగా పెరిగింది.
రిస్క్ తీసుకున్న బియానీ : ఒక వ్యాపార‌వేత్త నిరంత‌రం కొత్త అవ‌కాశాల కోసం అన్వేషిస్తారు. అవ‌కాశాల అన్వేష‌ణ‌లో రిస్క్ తీసుకుని కొత్త ప‌ద్ధ‌తిలో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అయితే.. ఆ రిస్క్ కాలిక్యులేటెడ్ లేదా అన్ కాలిక్యులేటెడ్ అనేది ఆ వ్యాపార‌వేత్త విజ‌న్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. కిషోర్ బియానీ..ఒక వ్యాపార వేత్త ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించారు. రిటైల్ బిజినెస్ లో ఫ్యూచ‌ర్ గ్రూప్ స‌క్సెస్ తో ఆయ‌న ఆగిపోలేదు. నూత‌న అవ‌కాశాల వేట‌లో.. రిస్క్ తీసుకున్నారు. త‌న వ్యాపారాన్ని డైవ‌ర్సిఫై చేశారు. ఫ్యూచ‌ర్ గ్రూప్ రిటైల్ రంగంతో మొద‌లై అనేక రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టింది.
మిగిలిన రంగాల్లో ఎందుకు న‌ష్టపోయారు ?
2007లో బియానీ ఫ్యూచ‌ర్ గ్రూప్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ప్యూచ‌ర్​ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించింది. అదే సంవ‌త్సరం ఫ్యూచ‌ర్ క్యాపిట‌ల్ ను ప్రారంభించింది. వెల్త్ మేనేజ్ మెంట్ స‌ర్వీసెస్, ఈక్విటీ బ్రోకింగ్ సొల్యూష‌న్స్, రియ‌ల్ ఎస్టేట్ బ్రోకింగ్ సోల్యూష‌న్స్, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్స్ ఇలా అవ‌కాశం ఉన్న అన్ని రంగాల్లోకి ఫ్యూచ‌ర్ గ్రూప్ ప్రవేశించింది. బాలీవుడ్ లో రెండు సినిమాలు నిర్మించి న‌ష్టపోయింది. ఇలా వివిధ రంగాల్లోకి ఫ్యూచ‌ర్ గ్రూప్ ప్రవేశించే క్రమంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది. కిషోర్ బియానీ అనుకున్నట్టు రిటైల్ బిజినెస్ లాగా.. మిగిలిన రంగాలు ఆయ‌న‌కు క‌లిసిరాలేదు. 2019 మార్చి 31 నాటికి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కిషోర్ బియానీ కంపెనీల అప్పు 10,951 కోట్లు ఉంటే.. అదే సంవ‌త్స‌రం సెప్టంబ‌ర్ 30 నాటికి 12,778 కోట్లుగా పెరిగిన‌ట్టు ICRA తెలిపింది.

డైవ‌ర్సీఫికేష‌న్ దెబ్బతీసిందా ?
కిషోర్ బియానీ త‌న పెట్టుబ‌డుల‌ను వివిధ రంగాల్లో పెట్టడంతోనే న‌ష్టపోయార‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతారు. అదే స‌మ‌యంలో 2008 గ్లోబ‌ల్ ఎక‌న‌మిక్ క్రైసిస్… 2020లో క‌రోన సంక్షోభంతో ఆయ‌న వ్యాపారాలు తీవ్రమైన న‌ష్టాల‌ను చ‌విచూసాయి. చాలా వ్యాపారాల‌ను త‌న ప్రత్యర్థి కంపెనీల‌కు అమ్మాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 24,713 కోట్ల విలువైన ఫ్యూచ‌ర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ ను ముఖేష్ అంబానీకి .. అమ్మకానికి పెట్టారు. ఫ్యూచ‌ర్ గ్రూప్ ఎదగ‌డంలో రిటైల్ బిజినెస్ చాలా కీల‌క‌మైన‌ది. ఇలాంటి రిటైల్ బిజినెస్ అమ్మకానికి పెట్టడం వెనుక ఉద్దేశం కిషోర్ బియానీ త‌న కంపెనీ షేర్ హోల్డర్లకు, ఉద్యోగుల‌కు చెప్పారు. షేర్ హోల్డర్లు, ఉద్యోగుల భ‌విష్యత్తును దృష్టిలో ఉంచుకుని .. ఫ్యూచ‌ర్ గ్రూప్ లోని రిటైల్ విభాగాన్ని రిల‌య‌న్స్ కు అమ్మకానికి పెట్టిన‌ట్టు బియానీ తెలిపారు.
కిషోర్ బియానీ ఉత్తాన ప‌త‌నాల‌ను గ‌మ‌నించాక‌.. ఆయ‌న జీవితం నేటి యువ వ్యాపార‌వేత్తల‌కు గొప్ప పాఠం అని చెప్పవ‌చ్చు. ఆయ‌న నూత‌న ఆలోచ‌న విధానం, ఎదిగిన తీరు, క‌ష్టకాలంలో త‌న‌తో న‌డిచిన‌వారి బాగుకోర‌డం.. ఇలాంటి ఎన్నో ఆయ‌న జీవితంలో జరిగిన మార్పులు ఎంద‌రికో ఆద‌ర్శం అని చెప్పవ‌చ్చు.
కిశోర్​ బియ్యాని, యువ వ్యాపర దిగ్గజ్జం, బిజినెస్​, రెడిమేడ్​ దిగ్గజం,

About Author