PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత భక్తిశ్రద్ధలతో బృందావనంలో 108వ శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సమాజంలో భక్తి భావనను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా కర్నూలు పట్టణంలో వెలసిన శ్రీ గోదాగోకులం నేతృత్వంలో ఈ భూమి మీద దేశ విదేశాలలో వెలసిన 106 దివ్య క్షేత్రాలలో శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞాలు పూర్తిచేసుకుని, పాలకడలికి ప్రతీకగా 107వ శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం పూరీ జగన్నాథ్ క్షేత్రంలో, పరమ పదానికి ప్రతీకగా 108వ శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం పరవాసుదేవునికి వైకుంఠం కన్నా అత్యంత ప్రీతికరమైన, శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి, నడయాడి, అనేక లీలలు ప్రదర్శించిన బృందావన క్షేత్రంలో, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1008 మంది  భక్తులతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈనెల 24న ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం 6 రోజులపాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష్య పర్యవేక్షణలో చతుర్వేద పరాయణులైన ప్రధాన యాజ్ఞికులు  శ్రీమాన్ సముద్రాల శ్రీమన్నారాయణాచార్య స్వామి నేతృత్వంలో యాజ్ఞిక బృందం మొదటి రోజు ఉదయం, విష్వక్సేనేష్ఠి , సాయంత్రం అంకురార్పణ, రెండవరోజు సంతాన వేణుగోపాల హోమం, మూడవ రోజు వైభవేష్ఠి, నాలుగవ రోజు సుదర్శనేష్ఠి, ఐదవ రోజు శ్రీ లక్ష్మీ నారాయణేష్ఠి, ఆరవ రోజు శ్రీసూక్త హోమం, మహా పూర్ణాహుతి, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ సమాజంలో శాంతి సుస్థిరతలు ఏర్పడి, సనాతన ధర్మం వర్ధిల్లాలని అందరి హృదయాలలో భక్తి చైతన్యం వెల్లి విరియాలనే ఏకైక సంకల్పంతో ఈ కార్యక్రమం 2014వ సంవత్సరం ప్రారంభించబడి, నేటితో పూర్తయిందని వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిచే ప్రతిరోజు “భాగవతం – శ్రీకృష్ణ లీలలు” అనే అంశంపై ప్రతిరోజు భాగవత ప్రవచనం, రుక్మిణీ కళ్యాణం, గోవింద పట్టాభిషేకం, తెప్పోత్సవంతో పాటు, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన  సముద్రాల మాధవీ రామానుజన్ తమ శిష్య బృందంతో “శ్రీశ్రీశ్రీ అష్టాక్షరీ జీయరుల వైభవం” అనే నృత్య రూపకాన్ని అత్యంత నయన మనోహరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ప్రపన్న రాఘవ జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ పరమాత్మానంద గిరి స్వామి, శ్రీశ్రీశ్రీ అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామి, శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం కార్యక్రమ నిర్వాహకులు మరియు గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజుతో పాటు గోదాగోకులం పరివారం, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author