ఈనెల 14 న “జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం”
1 min read– జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలో ఉన్న 3,99,942 మంది పిల్లలందరికీ నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవంపై సంబంధిత అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ….ఈనెల 14 వ తేదీన “జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 1సం నుండి 19 సంవత్సరాల వయసు గల 3,99,942 మంది పిల్లలకు అల్బెన్దజోల్ 400మీ.గ్రా మాత్రలు తప్పకుండా మింగించాలన్నారు. ఈనెల 15వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 14వ తేదీన కచ్చితంగా పిల్లలందరూ స్కూళ్లకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిఇఓ ను కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో సంవత్సరం పై బడిన పిల్లలందరూ మాత్రలు మింగే విధంగా చూడాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులందరూ కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే 108 సిబ్బంది వాహనాలు కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు. ఆరోగ్యశాఖతోపాటు విద్యాశాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ విభాగము అనుసంధానంతో కచ్చితంగా నులిపురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ,డి.సి.హెచ్.ఎస్ జఫరూళ్ళ తదితరులు పాల్గొన్నారు.