మే 16 తేదీన “జాతీయ డెంగ్యూ దినోత్సవం”
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఆర్ధోవైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్ ల వల్ల ఈ వ్యాధి వస్తుంది.ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్ ఈజిప్టై దోమలద్వారా సంక్రమిస్తుంది.
ఆడ ఏడిస్ ఈజిప్టై దోమకాటు ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ జాతి దోమ పైన నల్లటని, తెల్లని చారలు ఉండుటవలన దీనిని టైగర్ దోమ అనికూడా పిలుస్తారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉంటాయి. పగటిపూట మాత్రమే కుడతాయి.ఇవి ఎక్కువ దూరం (600 మీటర్లు) ఎగరలేవు. అన్ని రకాల దోమలకంటే ఈ దోమ చాలా బరువైనది.డెంగ్యూ వైరస్ తో Infect అయిన దోమలోనే కాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్ ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుంది. ఈ వైరస్ వలన ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చు.
వ్యాధి లక్షణాలు :-
1) ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి
2) విపరీతమైన కండరాలు,కీళ్ళ నొప్పులు
3) కళ్ళు నొప్పులు, కంటి కదలిక తగ్గటం మరియు నొప్పి
4) ఒక్కొక్కసారి శరీరంలో ఎర్రటి దద్దుర్లు
5) చిగుళ్ళ నుండి రక్తస్రావం
6) అధిక దాహం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
డెంగీ వ్యాధి మూడు రకాలుగా బయటపడవచ్చు..
1)- డెంగీ జ్వరం
2)- డెంగీ హెమరేజ్ జ్వరం
3)- డెంగీ షాక్ సిండ్రోమ్
అంతర్గత కాలము:-
డెంగీ వైరస్ Infect అయిన దోమకాటు తరువాత 3 నుండి 14 రోజులలో డెంగీ వ్యాధి రావచ్చు. డెంగీ వైరస్ తో Infect అయిన తరువాత సాధారణంగా 80% మందికి దానంతటదే తగ్గిపోతుంది. వీరికి ఎర్రటి దద్దుర్లు వచ్చిన సమయంలో రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గినా సాధారణ స్థితికి చేరుకుంటారు. మిగతా రెండు రకాలలో (డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్)రక్తంలో ఈ ప్లేట్ లెట్స్ బాగా తగ్గడం వల్ల వీరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం.
నిర్ధారణ :-
డెంగీ జ్వరం నిర్ధారించడానికి మొదటి వారంలో NS1 Rapid Kit తో Presumptive test PHC మొదలు అన్ని ప్రభుత్వ, హాస్పిటల్స్ లలో చేస్తారు. రెండవ వారంలో వ్యాధి తీవ్రతను బట్టి ధ్రువీకరణ పరీక్ష “మాక్ ఎలీసా” పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 సెంటినెల్ సెంటర్స్ ( 11 బోధనా ఆసుపత్రులు, 4 జిల్లా ఆసుపత్రులు ) లో చేస్తారు. ఈ పరీక్షలో ధ్రువీకరించితేనే అది డెంగీగా నిర్ధారణ అవుతుంది.
చికిత్స :-
డెంగీ వ్యాధి వచ్చిన వారికి 80% సపోర్టివ్ ట్రీట్మెంట్ తో తగ్గిపోతుంది. మిగతా రెండు రకాలు (డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్) వచ్చినవారికి ఆసుపత్రిలో ప్లేట్ లెట్లు ఎక్కించవలసి వస్తుంది. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ప్రమాదం ఎక్కువ. కాబట్టి త్వరితగతిన చికిత్స చేయించుకోవాలి.
నివారణ చర్యలు :-
1) ఇంటిలోపల మరియు ఇంటి ఆవరణలో ఎక్కడా మూతలేకుండా కొద్దిగా నీళ్ళుకూడా నిల్వ ఉండకూడదు.
ఉదాహరణకు పూలకుండీల క్రింద, పెంకులు, కొబ్బరిబోండాలు, రుబ్బురోళ్ళు, పనికిరాని వస్తువులు, పాతటైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, గాబులు, నీటి ట్యాంకులు, సంప్ లు, కూలర్లు, నీటి గుంటలు మొదలగునవి.
2) ఇంటిలో నీరు నిల్వలు ఉన్న పాత్రలపైన మూతలు పెట్టాలి.
3) వారానికి ఒకసారి అన్ని నీటి నిల్వలను పారపోసి, పాత్రలను శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రైడే” పాటించాలి.
4) నీటి గుంటలు, చెరువులు, బావులు మొదలగు వాటిలో ప్రభుత్వ యంత్రాంగంతో “గంబూషియా” 🐟 చేపలను వేయించుకోవాలి.
5) ఇంటిలో లేదా ఆవరణలో mosquito repellent మొక్కలు బంతి, పుదీనా మొ”నవి పెంచుకోవాలి.
6) ఇళ్ళు మరియు ఆవరణ ప్రతిరోజూ ఉదయం సాయంత్రం శుభ్రపరుచుకోవాలి.
7) డెంగీ అని అనుమానం వచ్చిన వెంటనే ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలి.
8) దోమలు పుట్టకుండా కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
9) దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలి.
10) వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
11) దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి.
12) దోమకాటు ఆరోగ్యానికి చేటు. కనుక సమాజంలో ప్రతి ఒక్కరూ దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.