కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి
1 min read
పల్లెవెలుగు , నంద్యాల: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన త్యాగనిరతిని డిఆర్ఓ రాము నాయక్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రెడ్డి సేవా సంఘం ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి, తిరుపం రెడ్డి, సాయిరాం రెడ్డి, శివకుమార్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రాము నాయక్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. సాంప్రదాయ వ్యవసాయ వ్యవస్థలో బ్రిటిష్ వారు చేసిన మార్పులకు వ్యతిరేకంగా నరసింహారెడ్డి నిరసన తెలిపారన్నారు. 1806 నవంబర్ 24న కర్నూలు జిల్లాలోని రూపన గుడిలో జన్మించి స్వాతంత్ర సాధన కోసం బ్రిటిష్ పాలకులతో వ్యతిరేకంగా పోరాటం చేసి 1847 ఫిబ్రవరి 22న వీరమరణం పొందారన్నారు.