18 ఏళ్లవారు.. ఓటరుగా నమోదు చేసుకోండి : జెడ్పీ సీఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు జడ్పీ సీఈఓ వై హరిహరనాథ్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆధికారి,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టరు కార్తికేయ మిశ్రా ఆదేశాలతో… గురువారం పేట గౌరవర సెయింట్స్ ఆన్స్ కళాశాలలో ఓటరు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ వై హరినాథ్ మాట్లాడుతూ ఓటు యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు సవివరంగా వివరించాలని కోరారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ ఎంతో కీలకం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆశిస్తున్నారో వారు సమీపంలోని బూత్ స్థాయి అధికారిని లేదా సంబంధిత మండల తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వచ్చే ఏడాది అనగా 01.01.2022 తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన వారంతా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దీనితోపాటు చిరునామా, పేర్లలో మార్పులు చేర్పులకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి ఫారం-6 కొత్త ఓటరు నమోదుకు, ఫారం-7 జాబితాలో మార్పులకు, ఫారం-8 పోలింగ్ బూత్ మార్పుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లోకి వెళ్లి సంబంధిత దరఖాస్తును పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ కమిషనర్ డి చంద్రశేఖర్, తహసిల్డార్ సోమశేఖర్,డిప్యూటీ తహాసిల్దార్ లాం. విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మెరిట్టో డిమెల్లో,కళాశాల విద్యార్ధినులు తదితరులు ఉన్నారు.