NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్పత్రి పై కప్పు పై 200 మృతదేహాలు !

1 min read

పల్లెవెలుగువెబ్ పాకిస్థాన్ లోని ఓ ఆసుపత్రి భవనం పైభాగంలో దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. ఓ గదిలోనూ, వెలుపల దాదాపు 200 మానవ కళేబరాలు దర్శనమిచ్చాయి. అవయవాలు కుళ్లిపోయిన స్థితిలో ఈ కళేబరాలను గుర్తించారు. ముల్తాన్ నగరంలోని నిష్తార్ ఆసుపత్రి మార్చురీ పైభాగంలో ఈ కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఓ వ్యక్తి అందించిన సమాచారంతో ఈ కళేబరాలు బయటపడ్డాయని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సలహాదారు తారిఖ్ జమాన్ గుజ్జర్ వెల్లడించారు. తాను ఇటీవల నిష్తార్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఆ వ్యక్తి తనను కలిశాడని, ఓ మంచి పని చేయాలని భావిస్తే వెంటనే మార్చురీని తనిఖీ చేయండి అని చెప్పాడని గుజ్జర్ వివరించారు. దాంతో తాను మార్చురీ వద్దకు వెళితే, తలుపులు తీసేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారని వెల్లడించారు. తలుపులు తెరవకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించానని తెలిపారు. ఎట్టకేలకు వారు తలుపులు తెరిచారని, రూఫ్ పై 200 పురుషులు, మహిళల కళేబరాలు పడి ఉండడం కనిపించిందని గుజ్జర్ పేర్కొన్నారు. ఈ ఘోరం ఏంటని ఆసుపత్రి సిబ్బందిని అడిగితే వైద్య విద్యార్థుల పరిశీలన కోసం ఆ మృతదేహాలను ఉపయోగిస్తామని వారు బదులిచ్చారని వెల్లడించారు. తన 50 ఏళ్ల జీవితంలో ఇంతటి భయానక దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. వైద్య విద్యార్థుల పరిశీలన కోసం ఉపయోగించిన తర్వాత ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం భవనం పైభాగంలో పడవేశారని వివరించారు.

           

About Author