ఘంటసాల పాటలు .. అజరామరం
1 min read–ఘంటసాల గాన కళా సమితి గౌరవాధ్యక్షులు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. పి. చంద్రశేఖర్
పల్లెవెలుగు, కర్నూలు;
గానగంధర్వుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహిత ఘంటసాల పాటలు అజరామరం అని ఘంటసాల గాన కళా సమితి గౌరవాధ్యక్షులు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. పి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం ఘంటసాల 47వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయాకర్ భవన్ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఘంటసాల సినీ సంగీతానికి ఒక నూతన ఒరవడిని సృష్టించారని, సినిమా పాటలకు అత్యంత అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడటమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరుగాంచారన్నారు. అందువల్ల భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించిందని తెలియజేశారు. అనంతరం సుధారాణి ఘంటసాల ఆలపించిన కొన్ని అద్భుతమైన గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాన కళా సమితి అధ్యక్షులు జగన్ గుప్తా, కార్యదర్శి కట్టా రాఘవేంద్ర ప్రసాద్, రాముడు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.