26న భారత్ బంద్ ను జయప్రదం చేయండి
1 min readఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్
పల్లెవెలుగు వెబ్, కడప: కార్పొరేట్ కంపెనీల కోసం… మోదీ ప్రభుత్వం దేశ ప్రజల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టెస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ధ్వజమెత్తారు. ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సంక్షోభంలోకి కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని పరిరక్షిస్తామని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారని ప్రగల్బాలు పలికిన మోదీ ప్రభుత్వం.. నూతన సాగు చట్టాల పేరుతో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రైతాంగ వ్యతిరేక సాగు ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్యం, నిత్యావసర వస్తువుల చట్టం సవరణ ఏక కాలంలో మూజువాణి ఓటుతో అడ్డగోలుగా పార్లమెంటులో చట్టం చేశారన్నారు. ఈ చట్టాల వల్ల రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, కంపెనీల మోసాలకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడనికి వీలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ నిరంకుశత్వానికి నిరసనగా.. నల్ల చట్టాల రద్దుకై, విశాఖ ఉక్కు పరిరక్షణకై ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు సలావుద్దీన్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు గాలి చంద్ర, బి దస్తగిరి రెడ్డి, ఆర్ ఎన్ రాజా, సావంత్ సుధాకర్, కట్టా యానాదయ్య, బాల ఓబయ్య, అనిల్ కుమార్, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.